‘స్వచ్ఛ’ ఉద్యమంలో పాల్గొనండి

15 Sep, 2017 00:55 IST|Sakshi
‘స్వచ్ఛ’ ఉద్యమంలో పాల్గొనండి

మంత్రి కేటీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ప్రీతిపాత్రమైన స్వచ్ఛతపై కేటీఆర్‌కు ప్రధాని లేఖ రాశారు. పారిశుధ్యం పట్ల మన దృక్పథం సమాజం పట్ల ఉండే దృక్పథంపై కూడా ప్రతిబింబిస్తుందన్న గాంధీ మాటలను గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర భారత్‌ను సాధించగలమని లేఖలో పేర్కొన్నారు. ప్రతి దేశ పౌరుడు శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

గాంధీ జయంతి రోజు న ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘స్వచ్ఛత హి సేవ’మంత్రంతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. పారిశుధ్యం కోసం పనిచేయడమంటే పేద, బలహీన వర్గాలకు సేవ చేయడమే అన్నారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను లేఖలో ప్రస్తావించారు. సహజ వనరులను పరిరక్షించుకోవడంతో పాటు వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలు చూపడమే స్వచ్ఛ భారత్‌ లక్ష్యమన్నారు. ‘స్వచ్ఛ యే సేవ’ ఉద్యమానికి మద్దతు తెలపాలని, ‘స్వచ్ఛ భారత్‌’కు సమయం కేటాయించాలని కేటీఆర్‌కు ప్రధాని సూచించారు.

మోదీకి కేటీఆర్‌ కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథను గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తడి, పొడి చెత్త , స్వచ్ఛ ఆటోలు, వ్యర్థాల నిర్వహణ వంటి వినూత్న అంశాలతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. ప్రధాని సందేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక శాఖల ఆధ్వర్యంలో స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కేటీఆర్‌ చెప్పారు.  


 

మరిన్ని వార్తలు