పంద్రాగస్టు లేదా గాంధీ జయంతి!

3 Feb, 2018 01:46 IST|Sakshi

‘మోదీ కేర్‌’ ప్రారంభించేందుకు కేంద్రం ప్రయత్నం

నిధుల సమకూర్పులో కేంద్ర, రాష్ట్రాల వాటా 60:40

తొలి ఏడాదికి రూ 2వేల కోట్ల మూలనిధి ఏర్పాటు: జైట్లీ

నిధులు కాదు.. అమలే సవాల్‌: నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌

‘ఆరోగ్యశ్రీ’ తరహాలో ట్రస్టుగానే ‘మోదీ కేర్‌’?  

న్యూఢిల్లీ: దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల కవరేజ్‌ అందించేందుకు ప్రభుత్వం ఉద్దేశించిన ‘మోదీ కేర్‌’ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్‌ 2) ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. వచ్చే (2018–19) ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించినప్పటికీ పథకం ప్రాముఖ్యత దృష్ట్యా స్వాతంత్య్ర దినోత్సవం లేదా గాంధీ జయంతిల్లో ఒకరోజు అట్టహాసంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం’ (దీన్నే మోదీ కేర్‌ అంటున్నారు)లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని జైట్లీ అన్నారు.

బడ్జెట్‌లో ఈ ఏడాది ‘మోదీ కేర్‌’ కోసం రూ.2వేల కోట్లతో ప్రాథమిక మూలనిధిని ఏర్పాటుచేశామన్నారు. పథకం అమలు ఆధారంగా వచ్చే ఏడాది తర్వాత మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు. దీని ద్వారా 10 కోట్ల కుటుంబాలకు (దాదాపు భారత జనాభాలో 40 శాతం మందికి) లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ వైద్య పథకం క్యాష్‌లెస్‌గానే ఉంటుందని రీయింబర్స్‌మెంట్‌ పథకం కాదని చెప్పారు. ‘ఈ పథకం ఆసుపత్రిలో చికిత్సను, అనంతర సంరక్షణను అందిస్తుంది. ఇందులో పలు ప్రభుత్వాసుపత్రులు, ఎంపికచేసిన ప్రైవేటు ఆసుపత్రులు ఉంటాయి.

ఇదో ట్రస్టు లాగా లేదా ఇన్సూరెన్స్‌ లాగా పనిచేస్తుంది. రీయింబర్స్‌మెంట్‌ సాధ్యం కాదు’ అని అన్నారు. పాలసీదారులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తగ్గటం సహజమేనన్నారు. ఈ విధానాన్ని నీతి ఆయోగ్, వైద్య శాఖ సంయుక్తంగా రూపొందించాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1 తర్వాత)లో ఏదో ఒకరోజు దీన్ని ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన ‘ఆరోగ్యశ్రీ’ ట్రస్టులాగే మోదీకేర్‌ను ట్రస్టులా నిర్వహించొచ్చనే భావనా వ్యక్తమవుతోంది. ఈ పథకం ద్వారా  రూ.11వేల కోట్ల భారం పడుతుందని అంచనా.

నిధులు కాదు.. అమలే సవాల్‌
ఈ పథకానికి నిధుల సమస్యలేదని వైద్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. అమల్లో ఉండే అవరోధాలనూ కేంద్రం పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే పథకానికి సంబంధించిన అన్ని వివరాలనూ వెల్లడిస్తామన్నారు.  పథకాన్ని అమలు చేయాలా? వద్దా? లేక సొంత నిధులతో నడుపుకోవాలా? అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చన్నారు. అన్ని అనారోగ్య సమస్యలకూ ఈ పథకంలో చికిత్స అందుతుందన్నారు. నిధుల సమీకరణ ఇబ్బందేం కాదని.. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయటమే అసలు సవాల్‌ అని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ‘ఏడాదికి రూ.5 లక్షల రూపాయల కవరేజీ ఇచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.1,000 నుంచి 1,200 వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి’ అని నీతి ఆయోగ్‌ సలహాదారు అలోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.  

ఒక్క శాతం సెస్‌ పెంచితే చాలు
ఈ పథక రూపశిల్పి, నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ కుమార్‌ పాల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కశాతం అదనపు విద్య, వైద్య సెస్‌ ద్వారా ఈ పథకానికి అవసరమైన నిధిని సమకూర్చవచ్చన్నారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల జనగణన ఆధారంగానే పేదల గుర్తింపు ఉంటుందన్నారు. పథకాన్ని వాడుకునేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదన్నారు. కాగా, బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకుండా పథకాన్ని ప్రకటించడం అంటే.. దారం లేకుండా గాలిపటాన్ని ఎగరేయటమేనని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. ‘వాస్తవానికి అక్కడ గాలిపటమూ ఉండదు, ఎగరటమూ ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అమలు ఎలా..?
కేంద్ర బడ్జెట్‌లో అందరినీ ఆకర్షించిన ప్రధానాంశం జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్‌హెచ్‌పీఎస్‌). దేశ జనాభాలో మూడోవంతుకు దీర్ఘకాలంలో ఆరోగ్యబీమా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఒబామాకేర్‌ తరహాలో ప్రభుత్వం మోదీ కేర్‌ అని పిలుస్తోంది. మరి ఈ మోదీ కేర్‌ పథకం ఎలా ఉంటుంది? దీన్ని ఏయే సంస్థలు అమలు చేస్తాయన్న వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 ఏప్రిల్‌ ఒకటిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన∙రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షతన నడిచే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా విజయవంతంగా అమలు చేశారు.

ఐఏఎస్‌ అధికారి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) గా ఉన్న ట్రస్ట్‌ ఆరోగ్యపరిరక్షణరంగ నిపుణులతో సంప్రదించి ఆరోగ్యశ్రీని సాధ్యమైనంత పకడ్బందీగా అమలు చేసింది. ఎన్‌హెచ్‌పీఎస్‌ అమలుకు చేతులు కలపాలని తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రైవేటు కంపెనీలను కూడా కేంద్ర సర్కారు కోరవచ్చు. కాని, ప్రతి ఏటా అదనంగా అవసరమైన సొమ్మును ప్రైవేటు పారిశ్రామికవేత్తలు సకాలంలో ఎలా అందజేస్తారన్న విషయం కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే.. ఈ పథకాన్ని హడావుడిగా అమలు చేస్తే లాభపడేది ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు