మోదీ దత్తత గ్రామం ఎలా ఉందో తెలుసా?

23 May, 2016 20:30 IST|Sakshi
మోదీ దత్తత గ్రామం ఎలా ఉందో తెలుసా?

నాయకులు పని చేయాలనుకున్నా.. అందరూ కలిసి రానిదే అభివృద్ధి అసాధ్యం. వీధిలైట్లు లేవని చీకటిలో గడిపిన వాళ్లే.. ఆ తర్వాత అవి ఏర్పాటుచేశాక వాటిలోని బల్బులు, సోలార్ దీపాలైతే వాటి బ్యాటరీలను చోరీ చేస్తే ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ప్రధానమంత్రి నరేంద్రమోదీ దత్తత తీసుకున్న గ్రామం దుస్థితి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. కూలిన బస్ షెల్టర్లు, విరిగిన ఐరన్ కుర్చీలు, చోరీకి గురైన సోలార్ దీపాలు, ఆవుపేడ దాచే కేంద్రాలుగా మరుగుదొడ్లు... ఇదీ అక్కడి పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లోని జయపూర్ సమీపంలో మోదీ దత్తత గ్రామంలో పర్యటించిన వారికి కళ్లకు కట్టినట్లు ఈ పరిస్థితి కనిపిస్తుంది.

గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడపడమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన ఎంపీ మోడల్ విలేజ్ స్కీం.. దుర్భర స్థితికి చేరుకుంటోంది. ప్రతి ఎంపీని పథకంలో భాగస్వామిని చేసి, గ్రామాలను బంగారు బాటలో నడిపించాలన్నదే ధ్యేయంగా పథకం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం మోదీ దత్తత గ్రామంలోనే దుర్భర స్థితి కళ్ళకు కడుతోంది. ఆయన కలల గ్రామంలోనే నిర్లక్ష్యం తాండవమాడుతోంది. 2014లో ఉత్తరప్రదేశ్ లోని జైపూర్ గ్రామాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దత్తత తీసుకున్న తర్వాత కూడా ఆ గ్రామం దీనావస్థలోనే ఉంది. గ్రామంలో అడుగు పెట్టినవారికి ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కళ్ళకు కడుతోంది. కూలిన బస్టాండ్లలో విరిగిన ఐరన్ కుర్చీలు, జూదరుల కేంద్రాలుగా మారుతున్న బస్ షెల్టర్లు, బల్బులు లేక కనిపించని సోలార్ వెలుగులు, విరిగిన తలుపులు, నీరు లేక చోరీకి గురైన కుళాయిలతో ఆవుపేడ నిల్వ కేద్రాలుగా మారిన స్వచ్ఛభారత్ అభియాన్ కింద నిర్మించిన మరుగుదొడ్లు. అంతేకాదు ఊరంతకీ వెలుగునిచ్చే సోలార్ బ్యాటరీ దీపాలు, 65 కుటుంబాలకు నీటి సరఫరాకోసం వినియోగించే మోటర్ సైతం చోరీకి గురవ్వడం... ఆ గ్రామం సందర్శించినవారికి కనిపించే దుర్భర పరిస్థితులు.


మోదీ స్వంత నియోజకవర్గం వారణాసికి 30 కిలోమీటర్ల దూరంలో మొత్తం 3,205 మంది నివాసితులు కలిగిన గ్రామాన్ని ఆదర్శగ్రామంగా మార్చాలన్న మోదీ కల కేవలం రెండేళ్లలోనే ప్రజల ఉదాసీనత, పరిపాలనాధికారుల నిరక్ష్యానికి గురైంది. గ్రామంలో నిర్లక్ష్య ధోరణిని నిరోధించడానికి, గ్రామస్థుల వైఖరిలో మార్పులు తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదని గ్రామాధికారి నారాయణ్ పటేల్ చెబుతున్నారు. అయితే నాయకుల ఆరోపణలను గ్రామస్తులు ఖండిస్తున్నారు. కుర్చీలను సరిగా వెల్డింగ్ చేయించలేదని, గ్రామంలో యూనియన్ బ్యాంక్ స్థాపించిన లైబ్రరీ కమ్ కంప్యూటర్ సెంటర్ కూడా ఎప్పుడూ మూసే ఉంటుందని ఆరోపిస్తున్నారు. అయితే పుస్తకాలు చోరీ అవుతాయన్న భయంతోనే లైబ్రరీని మూసేయాల్సి వస్తోందని, అక్కడ ఉంచిన పుస్తకాలకు సైతం సంరక్షణ కరువౌతోందని, సోలార్ బ్యాటరీలు పర్యవేక్షించేవారు లేక చోరీకి గరౌతున్నాయని యూనియన్ బ్యాంక్  బ్రాంచ్ హెడ్ ప్రొసంజిత్ షీల్  తెలిపారు. పర్యవేక్షణా బాధ్యతలను స్థానిక నాయకులు తీసుకుంటే తమకు లైబ్రరీ తెరవడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. గ్రామంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం 35 సోలార్ దీపాలకు గాను ఎనిమిది సోలార్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయని, ఈ పరిస్థితులు తమను నిరుత్సాహ పరిచాయని షీల్ తెలిపారు. స్థానిక పరిపాలనాధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరించి అపహరణలను నిరోధించవచ్చన్నారు. ముందుగా గ్రామ ప్రజల వైఖరిలో మార్పు రానిదే గ్రామంలో ఎటువంటి అభివృద్ధీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.


నిజానికి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని మోదీ జైపూర్ గ్రామంలో మంచి రోడ్లు, సెల్ఫ్ ఆపరేటెడ్ వాటర్ పంపుల వంటి ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారని, గ్రామంలో బీఎస్ఎన్ఎల్ టవర్ కూడా నిర్మిస్తున్నారని, దగ్గరలోని సుమారు ఐదు గ్రామాలకు సరిపడే నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంకును నిర్మించారని, రోజుకు సుమారు 200 మందికి పైగా జనం వాడుకునేందుకు వీలుగా ఏటీఎం ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే గ్రామస్థుల స్వార్థ ప్రయోజనాలు అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్నాయని షీల్ అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు