ఘర్షణ వద్దు.. శాంతి ముద్దు

4 Sep, 2017 02:14 IST|Sakshi
ఘర్షణ వద్దు.. శాంతి ముద్దు
- బ్రిక్స్‌ ప్రారంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 
నేడు పలు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. రేపు జిన్‌సింగ్‌తో భేటీ! 
 
జియామెన్‌(చైనా): వివాదాస్పద అంశాల పరిష్కారానికి బ్రిక్స్‌ దేశాలు దౌత్యమార్గాన్ని కొనసాగించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. మూడ్రోజుల పాటు జరిగే బ్రిక్స్‌ దేశాల తొమ్మిదో వార్షిక సదస్సును చైనాలోని జియామెన్‌ నగరంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. భారత్‌తో ఇటీవలి డోక్లాం వివాదం ప్రస్తావన లేకుండా.. విభేదాల పరిష్కారానికి శాంతి, అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, ప్రపంచం యుద్ధ, ఘర్షణ పూరిత వాతావరణం కోరుకోవడం లేదని స్నేహపూర్వక ధోరణిలో జిన్‌పింగ్‌ మాట్లాడారు.

ఉగ్రవాదంపై పోరులో సమగ్ర విధానాన్ని అనుసరించాలని, ఉగ్రవాదాన్ని తుది ముట్టడించడమే కాకుండా, దాని వెనకున్న మూల కారణాలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. బ్రిక్స్‌ సభ్య దేశాలు విభేదాల్ని పక్కన పెట్టాలని, పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక చర్చల ద్వారా ఒకరి ఆందోళనల్ని మరొకరు గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం పెంపొందించే దిశగా అధిక దృష్టి సారించాలని కోరారు. నేడు బ్రిక్స్‌ సభ్య దేశాల అధినేతలైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు మైకేల్‌ టెమెర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఎజెండాలోని అంశాలపై చర్చతో పాటు గత సదస్సు తీర్మానాలపై సమీక్షిస్తారు.

 చైనాలోని ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో ఉన్న జియామెన్‌ నగరాన్ని టైఫూన్‌ మవర్‌ ఒక పక్క కుదిపేస్తుండగా.. మరోవైపు కీలకమైన బ్రిక్స్‌ దేశాల సదస్సు ప్రారంభమైంది. టైఫూన్‌ దెబ్బకు విమానాల రాకపోకలకు అంతరాయంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తొలిరోజు ‘బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌’ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.  
 
చైనా చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి జియామెన్‌ చేరుకున్నారు. నేడు బ్రిక్స్‌ సదస్సులో ప్రసంగించడంతో పాటు సభ్య దేశాలు, ఆతిథ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. సదస్సు ద్వారా ఫలవంతమైన చర్చలు, సానుకూల ఫలితాల్ని ఆశిస్తున్నానని, గోవా బ్రిక్స్‌ సదస్సుతో సాధించిన ఫలితాల్ని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు. మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగవచ్చని భారత అధికార వర్గాల సమాచారం. 73 రోజుల పాటు కొనసాగిన డోక్లామ్‌ వివాదం పరిష్కారమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
మరిన్ని వార్తలు