ప్రధానితో ‘మంచు’ కుటుంబం భేటీ

7 Jan, 2020 03:12 IST|Sakshi
ప్రధాని నరేంద్రమోదీని సోమవారం ఆయన నివాసంలో కలిసిన సినీ నటుడు మోహన్‌బాబు. చిత్రంలో కుమారుడు విష్ణు, కోడలు వెరోనికా, కుమార్తె మంచు లక్ష్మి.

అమిత్‌షాతోనూ సమావేశం

గొప్ప ప్రధానిని కలిశా: మోహన్‌బాబు

దక్షిణాది సినీ ప్రముఖులనూ కలుస్తానన్నారు: విష్ణు

మోదీలాంటి గొప్ప వ్యక్తిని చూడలేదు: లక్ష్మీ ప్రసన్న

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా, హోం శాఖ కార్యదర్శి ఎ.కె.భల్లాతో ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్‌ బాబు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో మోహన్‌ బాబు, ఆయన కూతురు, నటి మంచు లక్ష్మీప్రసన్న, ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు, కోడలు వెరోనిక సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అలాగే కేంద్ర హోం కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను కలిశారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడా రు. ఇవాళ ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశానని, రా ష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వాడిననాన్నరు.

వైఎస్‌ జగన్‌ మంచే చేస్తున్నారు..
‘జగన్‌ ముఖ్యమంత్రి అయ్యి ఆరు మాసాలైంది. నాకు తెలిసినంత వరకు మంచే చేస్తున్నారు. వారిని కాదని నేనేమీ ఇక్కడికి రాలేదు. మోదీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. క్లిష్ట పరిస్థితుల్లో భారత దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోదీ. హోం మంత్రి అంటే ఆ పదవికి వన్నె తెచ్చిన నేత అమిత్‌ షా. ఇలాంటి నాయకులు దేశానికి కావాలని అందరూ కోరుకుంటున్నారు..’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. మీ భేటీ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించగా.. ‘ఒక నటుడిగా వచ్చి గొప్ప ప్రధానిని కలిశా. వారి గొప్ప కార్యక్రమాలను అభినందించడానికి వచ్చా. ప్రధాని మోదీ ఆప్యాయంగా పల కరించారు. ప్రేమగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి..’ అని పేర్కొన్నారు. బీజేపీలోకి మిమ్మల్ని ఆహ్వానించారని వచ్చిన వార్తలపై ఏమంటారని అడగ్గా.. ‘2014లో కూడా కలిశాను. ఆయన ఆప్యాయత, నవ్వు, పలకరింపు కంటే ఏం కావాలి..’ అని అన్నారు. హోం కార్యదర్శిని కలవడంపై మాట్లాడు తూ.. ‘ఒక మంచి వ్యక్తిని కలవడంలో తప్పేముంది.. ఎప్పుడొచ్చినా అందరినీ కలుస్తాం..’ అని పేర్కొన్నారు. 

విద్యాసంస్థలను సందర్శించాలని ఆహ్వానించాం..
‘మీరు బాలీవుడ్‌ నటులను కలిశారు.. సౌత్‌ వాళ్లని కలవలేదని కొంత అసంతృప్తి ఉంది’ అని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ప్రధాన మంత్రి స్పందించారని మంచు విష్ణు తెలిపారు. బాలీవుడ్‌ నటులతో అవకాశం వచ్చింది కాబట్టి కలిశానని, దక్షిణాది నటులను కూడా త్వరలోనే కలుస్తానని చెప్పారన్నారు. స్వ యంగా తానే చొరవ తీసుకుంటానని కూడా చెప్పార ని విష్ణు వివరించారు. ‘మా విద్యాసంస్థలను సంద ర్శించాలని గతంలో ఓసారి ఆహ్వానించాం. గతంలో నే రావాల్సి ఉంది. తప్పకుండా వస్తానని ప్రధాని చెప్పారు..’ అన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘ఇండియా అంటే ..ఇది అని చాటి చెప్పిన ప్రధాని మన మోదీ. నేను పుట్టిన తర్వాత ఇలాంటి గొప్ప వ్యక్తుల ను చూడలేదు. దేశం కోసం ఎలా సహాయం చేయ మంటారని మోదీని అడిగాను. అవన్నీ త్వరలో పాయింట్‌ టు పాయింట్‌ విడుదల చేస్తా’ అన్నారు.

మరిన్ని వార్తలు