‘మోదీ ప్రభుత్వంలో మా జోక్యం లేదు’

18 Sep, 2018 20:06 IST|Sakshi

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్ భగవత్

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్ భగవత్ అన్నారు. సంఘ్‌ కార్యకర్తలుగా పనిచేసిన ఎంతో మంది సేవక్‌లు ప్రస్తుతం ఉన్నత పదవులు అలంకరించారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న.. ‘భారత్‌ భవిష్యత్తు : ఆరెస్సెస్‌ విధానం’  కార్యక్రమంలో పాల్గొన్న భగవత్‌ ప్రసంగించారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో స్వయం సేవకులు స్వతంత్ర, స్వాలంబనతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణమే ఆరెస్సెస్‌ లక్ష్యమని పేర్కొన్నారు. భిన్నత్వంతో ఏకత్వం భారతీయ సంస్కృతి గొప్పదనమన్న మోహన్‌ భగవత్‌.. దేశ ఉన్నతి కోసం కలిసి పని చేసేందుకు  ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఆరెస్సెస్‌ సేవకులకు శత్రువులెవరూ లేరని, ఒకవేళ అలాంటి వారెవరైనా ఉంటే దేశాభివృద్ధి కోసం వారిని కూడా వెంట తీసుకువెళ్తామని వ్యాఖ్యానించారు. జపాన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు.

రాజ్యాంగ పీఠిక చదివిన మోహన్‌ భగవత్‌
తన ప్రసంగంలో భాగంగా రాజ్యాంగ పీఠిక చదివిన మోహన్‌ భగవత్‌.. భారతీయులంతా ఏకగ్రీవంగా రాజ్యాంగాన్ని ఆమోదించి పాటిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరిస్తూ సంఘ్‌ పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొని పోవడమే తమ విధానమని స్పష్టం చేశారు. హిందూ సమాజంలో అస్పృశ్యత పాపమని, అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్రంలో ముస్లింలకు చోటు లేదంటే అసలు హిందుత్వానికే అర్థం లేదన్నట్లేనని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు