చరిత్ర సృష్టించిన మోహనా సింగ్‌

31 May, 2019 14:17 IST|Sakshi

న్యూఢిల్లీ : అవకాశం లభించాలేగానీ ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతారని నిరూపించారు మోహనా సింగ్‌. కఠిన పరీక్షల్లో నెగ్గి భారత తొలి యుద్ధ విమాన పైలట్‌(ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌)గా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో అత్యాధునిక యుద్ధ విమానాలను నడిపేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా రాజస్తాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో మోహనా సింగ్‌ జన్మించారు. అమృత్‌సర్‌లోని గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

ఇక మోహన తండ్రి వాయుసేనలోనే వారంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత లాడూ రామ్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఫ్లైట్‌ గన్నర్‌. ఈయన 1948 భారత్‌-పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్‌ చక్ర అవార్డు కూడా పొందారు. కాగా తండ్రి ప్రతాప్‌ సింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న చోటే మోహనా ట్రెయినీ కేడెట్‌గా చేరడం విశేషం.

కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...!
జెట్‌ ఫైటర్‌గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండు సార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్‌, లాండింగ్‌ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ  విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. ఇక మోహనా సింగ్‌తో పాటు భావనా కాంత్‌, అవనీ చతుర్వేది కూడా యుద్ధ విమానాలు నడిపేందుకు అర్హత సాధించేందుకు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు