'జనాన్ని పట్టించుకోను.. సీఎంకు సత్తా చూపుతా'

30 Sep, 2016 16:24 IST|Sakshi
'జనాన్ని పట్టించుకోను.. సీఎంకు సత్తా చూపుతా'

సివాన్: దేశంలోనే అత్యంత వివాదాస్పద నాయకుడిగా పేరుపొందిన ఆర్జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నం సివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. ముగ్గురి హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఆయనకు బిహార్ హైకోర్టు మంజూరుచేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దుచేయడంతో షహబుద్దీన్ లొంగిపోక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరోసారి సీఎం నితీశ్ కుమార్ ను ఉద్దేశించి విద్వేషపూరిత వాఖ్యలు చేశారు. (షహబుద్దీన్ బెయిల్ రద్దు)

'నేను ఎవరికీ భయపడను. ప్రజలు నా గురించి ఏమనుకున్నా పట్టించుకోను. న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. సీఎం నితీశ్ కుమార్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడిఉంటా. వచ్చే ఎన్నికల్లో నితీశ్ కు సత్తా చూపేందుకు నా అనుచరులంతా సిద్ధంగా ఉన్నారు' అని కోర్టులో లొంగిపోయేముందు షహబుద్దీన్ అన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒకప్పుడు ముఖ్య అనుచరుడిగా ఉన్న షహబుద్దీన్.. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరులను హత్యచేశారనే ఆరోపణలపై 11 ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు. సెప్టెంబర్ 7న బిహార్ హైకోర్టు అతనికి బెయిల్ మంజురుచేసింది. ఇప్పుడా ఉత్తర్వులను రద్దుచేసిన సుప్రీంకోర్టు.. హత్యకేసు విచారణను త్వరగా పూర్తిచేయాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు