మాన్‌శాంటో లేటెస్ట్ పత్తి విత్తనాలు ఇక రానట్లేనా!

26 Aug, 2016 17:26 IST|Sakshi
మాన్‌శాంటో లేటెస్ట్ పత్తి విత్తనాలు ఇక రానట్లేనా!

న్యూఢిల్లీ: తదుపరి తరం జన్యుమార్పిడి పత్తి విత్తనాలను భారత దేశంలో ప్రవేశపెట్టేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దాఖలు చేసుకున్న దరఖాస్తును అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీ మాన్‌శాంటో హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈ విషయంలో కంపెనీకి, భారత ప్రభుత్వానికి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లే.

మాన్‌శాంటో తదుపరి తరం పత్తి విత్తనాలను దేశంలోకి అనుమతించాలంటే ఆ జన్యుమార్పిడి విత్తనానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక పత్తి విత్తన కంపెనీలతో పంచుకోవాలంటూ భారత ప్రభుత్వం షరతు విధించడం వల్ల ఇంతకాలం కంపెనీకి, భారత ప్రభుత్వానకి మధ్య వివాదం కొససాగింది.

ఇప్పుడు ఊహించని విధంగా తాము అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నామని తెలియజేస్తూ మాన్‌శాంటో భారత భాగస్వామి అయిన మహారాష్ట్ర హైబ్రీడ్ సీడ్స్ కంపెనీ లిమిటెడ్  కేంద్రానికి లేఖ రాసింది. ‘బోల్‌గార్డ్-2 రౌండప్ రెడీ ఫ్లెక్స్’ టెక్నాలజీకి సంబంధించిన కొత్త విత్తనాలను ప్రవేశపెట్టేందుకు ఇంతకాలం చేసిన ప్రయత్నాలన్నీ ఈ దరఖాస్తు ఉపసంహరణతో మట్టిలో కలసినట్లే. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త విత్తనాల అభివృద్ధి కోసం పెట్టిన పెట్టుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున ఆకర్షించాలనుకుంటున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి కూడా ఇది నష్టం కలిగిస్తుందని, ఎలాంటి పరిస్థితులైన తట్టుకునే వీలున్న ఈ కొత్త విత్తనాలు రైతులకు అందుబాటులోకి రాకపోవడం వల్ల వారు కూడా నష్టపోయినట్లేనని మార్కెట్ శక్తులు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ఇది మేధో సంపన్న హక్కుల పరిరక్షణ ఉల్లంఘన అంశాన్ని కూడా లేవనెత్తవచ్చని ఆ శక్తులు అభిప్రాయపడుతున్నాయి. వ్యాపార రంగంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తాము దరఖాస్తును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందేతప్పా, ఇప్పటికే భారత్‌లో తాము కొనసాగిస్తున్న జన్యుమార్పిడి పత్తి విత్తనాల లావా దేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని మాన్‌శాంటో అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

భారత పర్యావరణ శాఖ మంత్రి మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంలో మళ్లీ మాన్‌శాంటో ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? అన్న అంశంపై సమాధానం ఇచ్చేందుకు అధికారులు కూడా సిద్ధంగా లేరు. మాన్‌శాంటోకు చెందిన బోల్‌గార్డ్-1 టెక్నాలజీ జన్యు మార్పిడి పత్తి విత్తనాలను భారత ప్రభుత్వం 2002లో మొదటి సారి అనుమతించింది. ఆ తర్వాత బోల్‌గార్డ్-2 టెక్నాలజీకి చెందిన విత్తనాలను 2006లో అనుమతించింది.

మరిన్ని వార్తలు