ఎప్పుడు వచ్చాయని కాదు.. ఎంత కురిశాయో తెలుసా ?

29 Sep, 2019 14:04 IST|Sakshi

107 శాతం.. అవును.. నేలమ్మ పులకరించేలా, రైతుల్లో హర్షం నింపేలా, కరువు తీరిపోయేలా ఈ సీజన్లో వానలు కురిశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించాక మొదట్లో మొరాయించాయి. ఉత్తరాదిన కుంభవృష్టి కురిస్తే, దక్షిణాదిపై వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఆఖర్లో యావత్‌ భారతావనిపై వరుణుడు కరుణ చూపించాడు. సెప్టెంబర్‌ వచ్చాక దక్షిణాదిన కూడా వానలు దంచి కొట్టాయి. ‘‘సెప్టెంబర్‌ 26 నాటికి దేశవ్యాప్తంగా 107శాతం వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ‘అని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ హోసైకర్‌ ట్వీట్‌ చేశారు. 110శాతం కంటే ఎక్కువగా వర్షాలు కురిస్తే అప్పుడు అధిక వర్షపాతంగా చెబుతామని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో సగటు వర్షపాతం కంటే ఈ ఏడాది ఎక్కువగా వానలు కురిశాయి. సర్వసాధారణంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్‌ 30కల్లా దేశం విడిచి వెళ్లిపోతాయి. కానీ ఈసారి రుతుపవనాల తిరోగమనం అక్టోబర్‌ 6 తర్వాత ప్రారంభమై పదిహేను రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాఉండగా, అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో మూడు, నాలుగు రోజుల్లో గుజరాత్, బిహార్, బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు