రెండు నెలలు సాధారణ వర్షపాతమే

4 Aug, 2018 05:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో మిగిలిన రెండు నెలలు ఆగస్టు, సెప్టెంబర్‌లలో రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. జూలై చివరి నాటికి బిహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా సమాన స్థాయిలో వర్షపాతం నమోదైందని పేర్కొంది. వచ్చే రెండు నెలలు ఇదే విధమైన ఆశాజనక పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. ‘ఆగస్టులో దీర్ఘకాల సగటు(ఎల్‌పీఏ) 9 శాతం  అటుఇటుగా 96 శాతంగా నమోదుకావచ్చు. జూన్‌లో వేసిన అంచనాల కన్నా అధికంగానే ఉండొచ్చు. రుతుపవనాల రెండో అర్ధభాగంలో దేశవ్యాప్తంగా 95 శాతం ఎల్‌పీఏ(అటుఇటుగా 8 శాతం)తో వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ ప్రకటించింది. వర్షపాతం 96–104 శాతం ఎల్‌పీఏ మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ రుతుపవనాలుగా భావిస్తారు. ఎల్‌పీఏ 90–96 శాతం మధ్య ఉంటే, దాన్ని సాధారణం కన్నా తక్కువ వర్షపాతంగా పరిగణిస్తారు. 

మరిన్ని వార్తలు