రుతుపవనాలకు విరామం

12 Jul, 2017 04:13 IST|Sakshi

మధ్య, దక్షిణ భారతంలో తగ్గిన వర్షపాతం
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణ భారత దేశ ప్రాంతాల్లో గత వారం రోజులుగా రుతపవనాలు మందగించాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే అక్కడ తక్కువ వానలు కురిశాయని వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం పేర్కొంది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ సీజన్‌లో కురవాల్సిన దానికన్నా 8 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం ఒక శాతం తగ్గింది.

ఇక ఉత్తర, ఈశాన్య భాగాల్లో వానలు 5 శాతం తక్కువగా కురిశాయి. కేరళ, దక్షిణ కర్ణాటకలోని లోతట్టు ప్రాంతాలు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అంచనా వేసిన దానికన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మాత్రం సాధారణం కన్నా 29 శాతం అధికంగా వానలు కురిశాయి. అయితే వచ్చే వారంలో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌  ఎం. మొహాపాత్ర పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు