పట్టాభిషేకం

20 Jan, 2020 13:00 IST|Sakshi
పర్లాఖెముండి సంస్థానం రాణి

పర్లాఖెముండి సంస్థానం తొలి మహిళా రాణిగా యువరాణి

సింహాసనం అధిష్టించిన కల్యాణీదేవి గజపతి

అధికారిక కార్యక్రమానికి ఈ నెల 22వ తేదీ ఖరారు

ఒడిశా, పర్లాకిమిడి: పర్లాఖెముండి సంస్థానం రాణిగా యువరాణి కల్యాణీ దేవి గజపతికి ఆదివారం పట్టాభిషేకం నిర్వహించారు. ఇంతవరకు దాదాపు 17 మంది రాజులు పర్లాఖెముండి సంస్థాన సింహాసనాన్ని అధిష్టించగా, ఇటీవల 17వ రాజు గోపీనాథ గజపతి మరణించడంతో ఆ స్థానం ఖాళీగా అయింది. అమరులు గోపీనాథ గజపతి రాజా వారికి కుమారులు లేకపోవడంతో ఆయన కుమార్తె యువరాణి కల్యాణీదేవి గజపతికి పట్టాభిషేకం నిర్వహించడం అనివార్యమైంది. దీంతో ఆ సంస్థానం సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళా రాణిగా యువరాణి కీర్తి గడించారు. 1550లో తొలిసారిగా శివలింగ నారాయణదేవ్‌ రాజుగా పర్లాఖెముండి సింహాసనం అధిష్టించిన విషయం విదితమే కాగా ఆ తర్వాత వరుసగా 17 మంది రాజులు పర్లాఖెముండి సంస్థానానికి రాజులుగా వ్యవహరించారు.

అయితే ఈ నెల 22వ తేదీన రాజమందిరం వద్ద పెద్దఎత్తున అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించేందుకు రాణి వారి అనుయాయులు సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజున అమర గోపీనాథ గజపతి శ్రద్ధకర్మ(చనిపోయి 12వ రోజు)కూడా కావడంతో అంతా కలసివస్తుందన్న నమ్మకంతో పట్టా భిషేక కార్యక్రమానికి నిర్ణయించినట్లు తెలు స్తోంది. సంస్థానం రాణిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యువరాణి కల్యాణీదేవి ఆస్థా న విధులను సక్రమంగా నిర్వహించి, రాజవంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాణి కల్యాణీదేవిని చికిటి రాణి, ఎమ్మెల్యే ఉషాదేవి కలిసి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేడీ నాయకులు ప్రదీప్‌ నాయక్, వి.ఎస్‌.ఎన్‌.రాజు, బసంత్‌ దాస్, సంస్థానం ప్రముఖులు ఉన్నారు.

మరిన్ని వార్తలు