200 మంది ఖైదీలు కనిపించడం లేదు!

29 Nov, 2019 08:11 IST|Sakshi

సాక్షి, చెన్నై: జైలు జీవితం ఓ శాపమైతే...పెరోల్‌ పొందడం ఖైదీలకు ఒక వరం. ఈ వరాన్ని వరప్రసాదంగా స్వీకరించిన ఖైదీలు జైలుకు టాటా..బైబై అంటూ చెక్కేస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో పెరోల్‌పై బయటకు వచ్చిన 200 మందికి పైగా ఖైదీలు కనపడకుండా పోయారంటూ జైళ్లశాఖ లబోదిబోమంటోంది. మంత్రుల సిఫార్సుతో పెరోల్‌ పొందినవారే వీరిలో అధికం కావడంతో మింగలేక, కక్కలేక బావురుమంటున్నారు. పరారీలో ఉన్న పెరోల్‌ ఖైదీలను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

తమిళనాడులో 9 కేంద్ర కారాగారాలుండగా, వీటిల్లో 13వేల మంది ఖైదీలున్నారు. వీరిలో 2,500లకు పైగా శిక్షాఖైదీలు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న నళినీ పెరోల్‌ పొంది మరలా జైల్లోకి రాగా, పేరరివాళన్, రాబర్ట్‌పయాస్‌ ప్రస్తుతం పెరోల్‌పై బయటే ఉన్నారు. న్యాయస్థానం, జైళ్లశాఖ ద్వారా ఖైదీలు పెరోల్‌ పొందుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. తన భర్త నటరాజన్‌ అనారోగ్యానికి గురైనపుడు, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌పై చెన్నైకి వచ్చి వెళ్లారు.

కేరళలో పోలీసు కాల్పుల్లో మరణించిన మావోయిస్ట్‌ మణివాచకం భార్య కలా, సోదరి చంద్రలకు సైతం కోర్టు పెరోల్‌ మంజూరు చేసింది. శిక్షా ఖైదీలైనా, విచారణ ఖైదీలైనా జైల్లో వారి స్రత్పవర్తనను అనుసరించి పెరోల్‌ను మంజూరు చేయడం సహజం. ఒక ఏడాది కాలంలో 15 రోజులపాటూ పెరోల్‌ మంజూరు చేసే అధికారాన్ని జైలు సూపరింటెండెంట్‌ కలిగి ఉన్నారు. జైళ్లశాఖ డీఐజీ రెండేళ్లకు నెలరోజులు, ప్రభుత్వమే అనుకుంటే ఎన్నిరోజులైనా పెరోల్‌ మంజూరు చేయవచ్చు. ఖైదీల కుటుంబసభ్యుల్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు, పొంగల్, దీపావళి ముఖ్యమైన పండుగలు, సమీప బంధువులకు తీవ్ర అనారోగ్యం, మరణం వంటి అశుభాలు చోటుచేసుకున్నా పెరోల్‌ మంజూరు చేస్తున్నారు. జైల్లో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురై, మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేరిస్తే కోలుకుంటారని జైలు అధికారులు భావించిన పక్షంలో కూడా పెరోల్‌ మంజూరు చేస్తారు. 

ఈ పెరోల్‌ రోజులను శిక్షాకాలం నుంచి మినహాయించరు. ఐదేళ్ల శిక్షను అనుభవిస్తున్న ఖైదీ నెలరోజులు పెరోల్‌ పొందినా ఐదేళ్ల శిక్షాకాలాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. పెరోల్‌లో ఉన్నపుడు పారిపోకుండా ఉండేందుకు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రతిరోజూ సంతకం చేయాల్సి ఉంటుంది. లేకుంటే పోలీసు బందోబస్తు పెడతారు. ఏ కారణం చేత పెరోల్‌ మంజూరైందో ఖైదీ దానికే పరిమితం కావాలి, మరో శుభం, లేదా అశుభ కార్యాలకు వెళ్లకూడదు. ఈ నిబంధనలను మీరినట్లయితే పెరోల్‌ను రద్దుచేయడంతోపాటూ అరెస్ట్‌ చేసి జైల్లో పెడతారు. 

పెరోల్‌పై ఛలో ఛలో: 
ఇలా అనేక కారణాలతో పెరోల్‌పై విడుదలైన ఖైదీల్లో తిరిగి జైలుకు చేరుకోని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలం క్రితం సేలం జైలు నుంచి పెరోల్‌పై బయటకు వెళ్లిన ఇద్దరు ఖైదీలు జైలుకు మరలా రాలేదు. వీరిద్దరిలో ఒకరు మాత్రమే పట్టుబడగా మరో వ్యక్తి ఆచూకీ తెలియలేదు. 1982 నుంచి ఈ ఏడాది వరకు 200 మంది ఖైదీలకు పైగా పెరోల్‌పై బయటకు వచ్చి పత్తాలేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. జైలు అధికారులను కాదని ప్రభుత్వం ద్వారా పెరోల్‌ మంజూరు చేయించుకున్న ఖైదీలే వీరిలో ఎక్కువగా ఉండడం గమనార్హం.

దీంతో ప్రభుత్వ సిఫార్సుతో పెరోల్‌ మంజూరు చేయడం నిలిచిపోగా జైలు అధికారులు, న్యాయస్థానానికే పరిమితం చేశారు. దీంతో పెరోల్‌ పొందే ఖైదీల సంఖ్య తగ్గిపోయింది. పెరోల్‌ ఖైదీలు పరారైతే జైలు అధికారులు అతడి నివాసానికి సమీపంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇస్తున్నారు. అయితే పెరోల్‌ ఖైదీల పరారీ కేసులపై పోలీసులు పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో వారు పట్టుబడడం లేదు. వారు ఎక్కడ దాక్కుని ఉన్నారనే సమాచారం కూడా అధికారులకు దొరకలేదు. 

దీంతో ఇలా పారిపోయిన పెరోల్‌ ఖైదీలను పట్టుకునేందుకు ప్రభుత్వమే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని జైలు అధికారులు కోరుతున్నారు.  
ఈ విషయమై జైలు అధికారులు మాట్లాడుతూ, జైళ్లశాఖను చూసే మంత్రుల సిఫార్సుతో పెరోల్‌ పొందినవారే ఎక్కువగా పారిపోతున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న తరువాత పెరోల్‌కు సిఫార్సు చేయడాన్ని మంత్రులు నిలిపివేశారని అన్నారు. ప్రస్తుతం శిక్షాఖైదీలకు మాత్రమే పెరోల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు