అయ్యప్ప దర్శనానికి మహిళల ప్రయత్నం

28 Dec, 2017 18:03 IST|Sakshi

సాక్షి, శబరిమల : ఈ ఏడు అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ నెల 26న మండల పూజలు పూర్తయిన నేపథ్యంలో.. అయ్యప్ప ఆలయ ఆదాయాన్ని దేవస్థానం బోర్డు గురువారం ప్రకటించింది. మండల పూజల నాటికి 168.84 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం బోర్డు, కేరళ దేవాదాయ శాఖామంత్రి సురేంద్రన్‌ ప్రకటించారు. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 25 వరకూ ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 20 కోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు.   

మండల - మకర విళక్కును పురస్కరించుకుని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 26 వరకూ తెరచి ఉంచారు. మకరవిళక్కును పురస్కరించుకుని డిసెంబర్‌ 30 నుంచి జనవరి 14 వరకూ ఆలయాన్ని తెరచి ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకూ అయ్యప్ప ఆలయానికి వచ్చిన సొమ్మును.. శబరిమలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికే వినియోగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శబరిమల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని..ఆయన దేవస్థానం బోర్డుకు సూచించారు. 

మహిళల ప్రయత్నాలు.. అడ్డుకున్న అధికారులు
ఈ ఏడాది కూడా అయ్యప్పను 10 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించే ప్రయత్నం చేసినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్‌ ప్రకటించారు. మండల పూజల సందర్భంగా 260 మంది స్త్రీలు.. అయ్యప్ప దర్శనం కోసం సన్నిధానంకు వచ్చారని ఆయన చెప్పారు. శబరిమల పవిత్రతను అందరు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.  అయితే వీరిని గుర్తించి వెంటనే వెనక్కు తిప్పి పంపినట్లు ఆయన తెలిపారు. శబరిమలలో ఆచార ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు