ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యం..400 మంది క్వారంటైన్

8 Jun, 2020 12:53 IST|Sakshi

ముంబై : భార‌త్‌లో క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతుంటే కొంద‌రి నిర్ల‌క్ష్యం ఇత‌రుల ప్రాణాల‌కు ముప్పు తెచ్చి పెడుతుంది. మ‌హారాష్ట్రలో వెలుగుచూసిన ఓ  ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యం 400 మందిని క్వారంటైన్‌లో ఉండేలా చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. ఆర్నాలా ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్య‌క్తి కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ది కార్డిన‌ల్ గ్రేషియ‌న్ ఆస్పత్రి‌లో చేరాడు. 15 రోజులుగా అక్క‌డే చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. అయితే క‌రోనా టెస్ట్ ఫ‌లితాలు రాక‌ముందే ఆసుప‌త్రి సిబ్బంది మృత‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కి అప్ప‌గించారు. దీంతో ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కి 400 మంది బంధువులు, స్నేహితులు హాజ‌ర‌య్యారు. అత‌డు క‌రోనా వ‌ల్లే చ‌నిపోయాడ‌ని త‌ర్వాత తెలిసింది. (పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్‌..)

ప్రోటోకాల్ ప్రకారం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రిలో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే క‌శ్చితంగా కోవిడ్ ప‌రీక్ష చేసి నెగిటివ్ అని నిర్ధార‌ణ అయ్యాకే కుటుంబానికి అప్ప‌గించాలి. ది కార్డిన‌ల్ గ్రేషియ‌న్ ఆస్ప‌త్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించి కరోనా నిర్ధారణ పరీక్ష నివేదిక రాక‌మునుపే మృత‌దేహాన్ని అప్ప‌గించారు. దీంతో అంత్య‌క్రియ‌ల‌కి హాజ‌రైన వారికి ఇప్ప‌డు క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. ఈ ఘ‌ట‌నపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు సంబంధిత ఆసుప‌త్రికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆస్పత్రి యాజ‌మాన్యం తోసిపుచ్చింది. తమ ఆస్పత్రి‌లో చేర్పించిన రోజే కోవిడ్ ప‌రీక్ష‌లునిర్వ‌హించామ‌ని, అందులో నెగిటివ్ వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది. అంతేకాకుండా మిగ‌తా కుటుంబ‌ స‌భ్యుల‌కి త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించామ‌ని తెలిపారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో తీవ్రంగా శ్ర‌మిస్తున్న వైద్యుల‌పై ఇలా నింద‌లు వేయ‌డం మంచిది కాద‌ని పేర్కొంది. (ఢిల్లీ నిర్ణయంపై మాయవతి అభ్యంతరం)


 

మరిన్ని వార్తలు