ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ చెలరేగిందిలా..

30 Aug, 2019 09:23 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్‌ దళాలు ఇప్పటివరకూ 222 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఈ ఏడాది పాక్‌ సైన్యం సరిహద్దుల్లో 1900 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడగా ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన 25 రోజుల్లోనే పాక్‌ 222 సార్లు కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగిందని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు తెలిపాయి. ఆగస్ట్‌ 5 నుంచి పాకిస్తాన్‌ సగటున రోజుకు 10 కాల్పుల విరమణ ఉల్లంఘనలకు దిగిందని వెల్లడైంది. పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలతో ఇరు పక్షాల మధ్య కాల్పుల ఘటనలకు దారితీసి ఉద్రిక్తతలు పెరిగాయి. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మలిచేందుకు పాకిస్తాన్‌ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పాటు సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ప్రేరేపిస్తోంది. పాక్‌ ఆగడాలను భారత సేనలు దీటుగా తిప్పికొట్టడంతో నిరాశలో కూరుకుపోయిన పాక్‌ తన కుయుక్తులకు పదునుపెడుతూనే ఉంది. మరోవైపు గుజరాత్‌ తీరంలోకి సముద్ర మార్గం ద్వారా పాక్‌ కమాండోలు, ఉగ్రవాదులు ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తలు