ప్రాణాధార ఔషధాలు మరింత ప్రియం!

8 Feb, 2016 01:26 IST|Sakshi

దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపును తొలగించిన కేంద్రం

 న్యూఢిల్లీ: కేన్సర్, హెచ్‌ఐవీసహా ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వాడే దాదాపు 74రకాలైన అత్యవసర ఔషధాలను కేంద్రం దిగుమతి సుంకం మినహాయింపు జాబితా నుంచి తొలగించడంతో దేశీయంగా వీటి ధరలు పెరగనున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు కష్టాలు మొదలుకానున్నాయి. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారైన ఔషధాల ఉత్పిత్తితోపాటు గిరాకీ పెంచడం, చైనా నుంచి ఔషధాల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం గత వారం ఈ నిర్ణయం తీసుకుంది.

దిగుమతలు తగ్గడంతో ఏర్పడే ఔషధాల కొరతను అధిగమించాలంటే దేశీయంగా ఔషధాల ఉత్పత్తిని పెంచాలని, ఇందుకు కనీసం ఏడాది పడుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ సెక్రటరీ డీజీ షా తెలిపారు. ఈలోపు కేన్సర్, హెచ్‌ఐవీ, గుండె సంబంధిత, మూత్ర పిండాల్లో రాళ్లు,  మధుమేహం, మూర్ఛ, ఎముకలు, ఇన్ఫెక్షన్లలో వాడే యాంటీబయోటిక్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, లుకేమియా, హెపటైటిస్, అలర్జీలు తదితర వ్యాధుల నివారణలో వాడే అతి ముఖ్యమైన 74 రకాల ఔషధాల ధరలు మరింత పెరగొచ్చు. కస్టమ్స్ సుంకం మినహాయింపు తొలగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ నిర్ణయం తీసుకోవడం వల్ల ధరలు దాదాపు 35% పెరిగేవీలుందని ఫార్మా వర్గాలు అంచనావేశాయి.

మరిన్ని వార్తలు