మరిన్ని రాష్ట్రాలపై కమలనాథుల కన్ను

1 Jun, 2014 02:03 IST|Sakshi
మరిన్ని రాష్ట్రాలపై కమలనాథుల కన్ను

బీజేపీ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచన

 
న్యూఢిల్లీ: భారీ మెజార్టీతో కేంద్రంలో అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ... ఇక పలు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు సహా నేతలు కొందరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో సంస్థాగత మార్పులపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో 7 రేస్‌కోర్స్ రోడ్డులోని మోడీ అధికారిక నివాసంలో జరిగిన ఈ అల్పాహార విందు సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు రామ్‌లాల్, జేపీ నద్దా, అమిత్ షా, పి.మురళీధర్‌రావు, అనంతకుమార్, ధర్మేంద్ర ప్రధాన్, వరుణ్‌గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, థవార్‌చంద్ గెహ్లాట్ తదితర నేతలు హాజరయ్యారు. త్వరలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో, వచ్చే ఏడాది జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, బీహార్ శాసనసభలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల సన్నద్ధతపై ఆయా నేతలతో మోడీ చర్చించారు. అలాగే 2016లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు చేయాల్సిన కసరత్తుపైనా ఆరా తీశారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ పార్టీలోని నేతలందర్నీ కలుపుకొని ముందుకు సాగాలని ప్రధాన కార్యదర్శులకు మోడీ సూచించారు. పార్టీని బలోపేతానికి ప్రయత్నించాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలన్నారు.

 పార్టీ సారథి ఎవరు?..

 బీజేపీ నూతన అధ్యక్షుడిగా, అలాగే ఖాళీ అయిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో ఎవర్ని నియమించాలనే విషయంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు జాల్ ఓర్నాం, ఉమాభారతి, స్మృతి ఇరానీ, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు అనంతకుమార్, థవార్‌చంద్ గెహ్లాట్, ధర్మేంధ్ర ప్రధాన్, పార్టీ కోశాధికారి పియూష్ గోయల్, అధికార ప్రతినిధులైన ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్‌లకు మోడీ మంత్రివర్గంలో చోటు దక్కడం తెలిసిందే. 1999లో ఇలాగే పార్టీలోని బడా నేతలంతా ప్రభుత్వంలో చేరడంతో క్షేత్ర స్థాయిలో పార్టీ పట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో అందుకు భిన్నంగా పార్టీని పటిష్టం చేసేలా పదవుల భర్తీ జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుతోంది.

మోడీతో రాజ్‌నాథ్, గడ్కారీ భేటీ

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీలు శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలుసుకుని పార్టీ సంస్థాగత అంశాలపై చర్చలు జరిపారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో చేయాల్సిన మార్పులు,చేర్పుల గురించి ఈ ముగ్గురు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు