భారత్లో 40 మంది మృతి

25 Apr, 2015 19:40 IST|Sakshi

ఉత్తరభారతం, ఈశాన్య భారతాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 40 మంది మరణించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి. గోయల్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

- భూప్రకంపనల వల్ల బీహార్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. ఇప్పటి వరకు బీహార్ లో 20 మందికి పైగా మరణించినట్టు, వందల మంది గాయపడినట్లు సమాచారం

- మాల్దాలో ఒక స్కూలు భవనం కుప్పకూలడంతో 40 మంది  విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

- భూకంప తీవ్రతకు యూపీలో ఆరుగురు బలయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉండటం శోచనీయం. కాన్పూర్లోని ఓ స్కూలు భవనం కూలడంతో ఆ చిన్నారి మృతిచెందింది. రాష్ట్రవ్యాప్తంగా వందల మంది గాయపడ్డారు.

- ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లో ముగ్గురు మృతిచెందగా, దాదాపు 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

- నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో ఓ భవనం కూలడంతో ఉద్యోగి కుమార్తె ఒకరు మరణించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు.

- బీహార్ కు 5, యూపీకి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఓపీ సింగ్ తెలిపారు.

- మధ్యప్రదేశ్ లోని భోపాల్, గ్వాలియర్, మండల్, హోషంగాబాద్, సిద్ధి జిల్లాలో భూకంపం తీవ్ర ప్రభావాన్నిచూపింది.

- భూకంప కేంద్రమైన నేపాల్ కు సమీపంగా ఉండటంతో ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

- భూకంప తీవ్రత వల్ల మంచుచరియలు విరిగిపడటంతో ఎవరెస్టు యాత్రకు వెళ్లిన 13 మంది మృతిచెందారు.

- స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎవరెస్టు పై చెత్త తొలిగించేందుకు వెళ్లిన భారత సైనికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మన సైనికులు ఒక ప్రాంతం నుంచి పక్కకు వెళ్లగానే అక్కడ భారీ ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడ్డాయని, ప్రస్తుతం సైనికులందరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు