ప్రతి గంటకూ ఓ నిరుద్యోగి బలవన్మరణం

12 Jan, 2020 20:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌ఆర్‌సీబీ నివేదిక ప్రకారం 2018లో 12,936 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య అదే ఏడాది రైతుల ఆత్మహత్యల కంటే అధికం కావడం గమనార్హం. ఇక 2017లోనూ అదే ఏడాది రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని నివేదిక తెలిపింది. 2018లో ప్రతి గంటకూ ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడినట్టు ఎన్‌ఆర్‌సీబీ గణాంకాంలు వెల్లడించాయి. ఆ ఏడాది జరిగిన 1,34,516 ఆత్మహత్యల్లో 9.6 శాతం నిరుద్యోగులవేనని తేలింది. అదే ఏడాది మొత్తం బలవన్మరణాల్లో 10,349 మంది రైతు ఆత్మహత్యలు కాగా ఇవి మొత్తం మరణాల్లో 7.7 శాతంగా నమోదయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల్లో 10,687 మంది పురుషులు కాగా, 2249 మంది స్త్రీలుగా గుర్తించారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ ఆత్మహత్యల్లోనూ 12.3 శాతంతో ముందువరుసలో నిలిచింది. ఇక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి.

మరిన్ని వార్తలు