ఆయుధాల్లో సగానికి పైగా పురాతనమైనవే!

14 Mar, 2018 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ : అమెరికా, చైనా లాంటి దేశాల్లో రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా ఉండగా.. మన దేశంలో మాత్రం ఆ కేటాయింపులు కేవలం రూ.25 వేల కోట్లకు మించడం లేదు. ఆయా దేశాల్లో ఆర్మీ మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా వారు ఆయుధ సామాగ్రిని సమకూరుస్తుండగా మన దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రిలో దాదాపు 70 శాతం చాలా పురాతనమైనవేనని ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చంద్‌ పార్లమెంట్‌ స్టాండింగ్‌  కమిటీకి చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న ఆయుధ సామాగ్రిలో 68శాతం పాతవే ఉన్నాయి. 24 శాతం మాత్రమే ఈ కాలం నాటివి. మిగతా 8 శాతం ఆర్ట్‌ విభాగానికి చెందినవి. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఆయుధాల ఆధునీకీకరణ కోసం 25 కార్యక్రమాలు ప్రారంభించాం. కానీ సరైన నిధుల కేటాయింపులు లేనందున ప్రస్తుతం వీటన్నింటిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ చాలా తక్కువ కేటాయింపులు చేశారు’  అన్నారు.

 ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఆర్మీ ఆధునీకీకరణ కోసం రూ.31 వేల కోట్లను కోరగా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేవలం రూ.21,338 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 125 ప్రాజెక్టులకే రూ.29 వేల కోట్లు అవసరం ఉండగా, కేంద్రం కేటాయించిన రూ.21 వేల కోట్లు వాటికే సరిపోవని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, నూతన ఆయుధాల కొనుగోలు ఇక సాధ్యం కాదని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం వినియోగిస్తున్న టీ-72 యుద్ద ట్యాంకులు 1980 నాటివని, వీటి స్థానంలో కొత్త కంబాట్‌ వాహానాలను కొనుగోలు చేయాలని భావించినట్టు చెప్పారు. కానీ అరకొర బడ్జెట్‌ కేటాయింపులతో ఇప్పుడు వీటి కొనుగోలుకు మరికొన్ని సంవత్సరాలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. 

భవిష్యత్తులో రెండు యుద్దాలు వచ్చే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఆర్మీ ఆధునీకీకరణ, లోటుపాట్లను పూరించుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాల్సినవసరం ఉందని పార్లమెంటరీ కమిటీకి నివేదించామని లెఫ్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చంద్‌ తెలిపారు. ప్రస్తుతం చాలా పెద్ద సంఖ్యలో చైనా వ్యూహాత్మక రహదారుల నిర్మాణం చేపడుతుందని, ఉత్తర సరిహద్దు వెంట మనం కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అడిగిన దాని కన్నా తక్కువగా సుమారు రూ. 902 కోట్లు మాత్రమే కేటాయించినట్టు పేర్కొన్నారు. మొత్తం మీద తాము అడిగిన దానికి, కేంద్ర కేటాయింపులకు మధ్య రూ. 12,296 కోట్లు వ్యత్యాసం ఉందని లెఫ్టినెంట్ జనరల్ శరత్‌ చంద్ అన్నారు.

మరిన్ని వార్తలు