కీలుబొమ్మగా మారిన మెహబూబా ముఫ్తీ

12 Apr, 2018 17:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందీ మాతో చేయి చేయి కలుపుతారని. కశ్మీర్‌లో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది. ఎక్కడో మిలిటెంట్లకు, ప్రభుత్వ సైనికులకు మధ్య కాల్పులు జరుగుతాయి. అంతే, టీవీ ఛానళ్లలో కశ్మీర్‌ మొత్తం తగులబడి పోతున్నట్లు చూపిస్తారు. మనమున్న పరిస్థితిని దాచేందుకు ప్రయత్నించడం లేదు. ఒక్కసారి ప్రపంచం వైపు చూడండి! ప్రతి చోటా ఏదో సమస్య ఉంటోంది. ఇక్కడ మన సమస్య ఏమిటంటే మన దేశమే మనల్ని ఒంటరి వాళ్లను చేసింది. నేను పిలవగానే మీరు రావడం ముందుగానే వసంత గాలులు వీస్తున్నట్లు ఉంది. ఇది శుభసూచకం. ఇక్కడ మనం చేయాల్సిన పని క్లిష్టమైనదే. మా తండ్రి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. కశ్మీర్‌కు ఓ పర్యాటకుడు రావడం అంటే ఇక్కడ శాంతి కోసం పెట్టుబడి పెట్టడమేనని. భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడుతున్నట్లే ఇక్కడ కూడా సైనికులు మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు మరోరకంగా మనమూ యుద్ధం చేయాల్సిందే. పర్యాటకరంగం పరిఢవిల్లేలా చేయడమే ఆ యుద్ధం. మనం దేశం నుంచి విడిపోయిన్లు భావించరాదు. అతి పెద్ద దేశంలో భాగంగానే బతుకుతున్నామన్న భావన కలగాలి’  అంటూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల శ్రీనగరంలో జరిగిన భారత పర్యాటక ఏజెంట్ల సమ్మేళనంలో ప్రసంగించారు. 

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివద్ధి చేయడం ద్వారా మిలిటెంట్‌ కార్యకలాపాలు తగ్గి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయన్నది ఆమె అభిప్రాయంగా స్పష్టం అవుతోంది. ఆమె తన ఉపన్యాసాన్ని కాస్త గంభీర్యంగానే ప్రారంభించినా ఆమె మాటల్లో ఆర్ద్రత, ఆవేదనతోపాటు అశక్తత కూడా కనిపించింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ పర్యాటకులు రావడం అంటే రాష్ట్రంలో శాంతి స్థాపనకు అది పెట్టుబడే అని ఎప్పుడూ చెప్పేవారు. అయితే ఆయన శాంతికి భంగం కలిగిస్తున్న వారిని ఎప్పుడూ మిలిటెంట్లు అని అనలేదు. వారిని తిరుగుబాటుదారులుగానే వ్యవహరించారు. గతంలో మొహబూబా ముఫ్తీ కూడా తిరుగుబాటుదారుల సమస్య అనే మిలిటెన్సీని వ్యవహరించారు. 

రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపి ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమె భాష మారినట్లు ఉంది. ఆమె పర్యాటక ఏజెంట్ల సమ్మేళనాన్ని నిర్వహించి ‘ఇయర్‌ ఆఫ్‌ విజిటింగ్‌ కశ్మీర్‌’గా నిర్ణయించిన రెండు రోజులకే ఎదురు కాల్పుల్లో  పౌరులు సహా 20 మంది మిలిటెంట్లు, సైనికులు మరణించారు. 2016, జూలైలో జరిగిన అల్లర్లలో దాదాపు వంద మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయి. మిలిటెంట్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హత్యతో ఆ అల్లర్లు చెలరేగాయి. అంతకుముందు మిలిటెంట్‌ కార్యకలాపాలకు అంతగా ప్రజల మద్దతు ఉండేది కాదని, 2016 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరగడంతోపాటు మిలిటెంట్‌ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కశ్మీర్‌ యూనివర్శిటీలో పనిచేస్తున్న పొలిటికల్స్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ తెలిపారు. రోజుకో ఏదోచోట కాల్పులు జరిగి పౌరులు కూడా మరణిస్తున్న  ప్రస్తుత పరిస్థితులకు ‘మోదీ నుంచి మెహబూబా వరకు అందరూ బాధ్యులే’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం ఆరుశాతం ఓట్లు నమోదయ్యాయంటే ఎన్నికల పట్ల, రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిందో తెలుస్తోంది. మెహబూబా తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎంపీ సీటుకు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం, గతేడాదే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి నేటికి నిర్వహించక పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.  జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గతంలో నేషనల్‌ కాన్ఫరెన్స్, మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలు ప్రజలకు  కనిపించేవి. ఇప్పుడు వాటి ఉనికిని కూడా ప్రజలు గుర్తించడం లేదు. అందుకని మిలెటెన్సీ పెరుగుతోంది.  మెహబూబా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆమె పట్లప్రజలకు సగం నమ్మకం పోయింది. సరైన పాలన అందించడంలో విఫలమైనందున ఆమె పట్ల పూర్తి విశ్వాసం పోయింది. 

కతువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను సైనికులు దారణంగా రేప్‌చేసి హత్య చేసిన కేసులో నిందితులకు మద్దతుగా జరిగిన ప్రదర్శనలో తన కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం పట్ల  మెహబూబా మౌనం వహిచండం ఆమె మద్దతుదారులు కూడా సహించలేకపోతున్నారు. ఇక ఆఖరి కశ్మీర్‌ నిరంకుశ రాజు హరీ సింగ్‌ విగ్రహాన్ని ఆమె ఇటీవల ఆవిష్కరించడాన్ని వారు అంతకన్నా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ప్రోద్బలంతో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె నేడు సీఎం కుర్చీలో కూర్చున్న కీలుబొమ్మ మాత్రమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు