మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్టు

18 Jul, 2014 10:25 IST|Sakshi

రాయగడ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండాను బరంపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో సవ్యసాచి పండాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సవ్యసాచిపై రూ.17 లక్షల రివార్డు ఉంది.

మరోవైపు ఒడిశాలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్ల నుంచి సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, దయ తప్పించుకున్నట్లు తెలిసింది. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులో నారాయణపట్న, కొప్పడంగి ప్రాంతంలో గల బ్రిడ్జిగుడ గ్రామ సమీపంలోని అడవుల్లో సహీద్ వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వీహెచ్‌ఎఫ్ 118, 28వ బెటాలియన్ బలగాలు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి.
 
సాయుధ బలగాల కదలికలను గమనించిన మావోయిస్టు నేతలు పరారయ్యారని తెలిసింది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు దయ, ఆర్కే, జంబు తదితరులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రఫ్‌కోన మీదుగా లులుపొదర్ కలహండి ప్రాంతానికి వెళ్లారని భావిస్తున్నారు. అక్కడున్న మావోయిస్టు శిబిరం నుంచి 4 టిఫిన్ క్యారియర్ బాంబులు, మందుపాతరకు వినియోగించే 50 మీటర్ల వైరు, ఎనిమిది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
 

మరిన్ని వార్తలు