20 ఏళ్లుగా అమ్మను భుజాన మోస్తున్నాడు!

20 Apr, 2016 14:21 IST|Sakshi
20 ఏళ్లుగా అమ్మను భుజాన మోస్తున్నాడు!

ఆగ్రా: జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలించుకుంటున్న బిడ్డలున్న మన సమాజంలో కన్నతల్లిని 20 ఏళ్లుగా మోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు అభినవ 'శ్రవణుడు'. అతడి పేరు కైలాశ్ గిరి. తన తల్లి కోరిక తీర్చేందుకు 20 ఏళ్లుగా దేశమంతా కాలినడన తిరుగుతున్నాడు. కళ్లులేని తన తల్లిదండ్రులను శ్రవణుడు కావడిలో మోస్తే... కైలాశ్ తన తల్లిని భుజాన మోస్తున్నాడు. ఛార్ ధామ్ యాత్ర చేయాలన్న తల్లి ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇప్పటివరకు కాలినడన 36,582 కిలోమీటర్లు ప్రయాణించాడు.

మధ్యప్రదేశ్ లోని జాబల్ పూర్ కు చెందిన 48 ఏళ్ల కైలాశ్ అంధురాలైన 92 ఏళ్ల తన తల్లి కీర్తిదేవిని కావడిలో భుజాన మోస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రాలు చుట్టివస్తున్నాడు. మాథూరా వెళుతుండగా అతడిని మీడియా ప్రతినిధులు పలకరించగా తన గురించి చెప్పాడు. 'నాకు 28 ఏళ్ల వయసులో 1996, ఫిబ్రవరిలో ఈ యాత్ర చేపట్టాను. ఇప్పుడు 50 ఏళ్లకు చేరువయ్యాను. నా కోసం, మా అమ్మ కోసం యాత్ర చేస్తున్నా. 20 ఏళ్లుగా ప్రయాణం చేస్తూనే ఉన్నా. మరికొన్ని పుణ్యక్షేతాలు దర్శిస్తే నా యాత్ర పూర్తవుతుంద'ని చెప్పాడు.

తన తల్లి కోరిక నెరవేర్చడానికి నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కథ గురించి చెబుతూ... 'నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి పడిపోయాను. నేను బతకడం కష్టమన్నారు. మా అమ్మ ఎన్నో పూజలు చేసి నన్ను బతికించింది. నా జీవితం ఆమెకే అంకితం. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే మానాన్న, సోదరుడు చనిపోయారు. ఆమె ఆకాంక్షను నేను కాకపోతే ఎవరు తీరుస్తారు' అని కైలాశ్ అన్నాడు. దేశవ్యాప్త పర్యటన తనకెంతో సంతోషం కలిగించిందన్నాడు. ఎంతో మంది తమకు సాయం చేశారని తెలిపాడు. తన తల్లిని తిరుపతికి తీసుకువస్తానని వెల్లడించాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు