అమ్మ కాదంది...అత్తమ్మ ఆదుకుంది

6 Oct, 2018 13:15 IST|Sakshi

అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పిన వైనమిది. కుటుంబాల్లో  సాధారణంగా అత్తాకోడళ్లది ఉప్పు-నిప్పు సంబంధం అన్న పాత భావనను తుడిచేశారు రాజస్థాన్‌కు చెందిన అత్తాకోడళ్లు గనీదేవి(60), సోనికా(32). ముఖ్యంగా ప్రాణాపాయస్థితిలో ఉన్న సోనికాను ఆదుకునేందుకు స్వయానా రక్తసంబంధీకులు కూడా నిరాకరించిన సందర్భంలో ఆమె అత్తగారు చూపించిన ఔదార్యం, ధైర్యం ఆదర్శంగా నిలిచింది.

బార్మర్‌ జిల్లా గాంధీనగర్ నివాసి సోనికాకు రెండు  మూత్రపిండాలు  పాడైపోయాయి. ఆమె ఆరోగ్యం మూత్రపిండ మార్పిడి తప్ప వేరేమార్గం లేదని ఢిల్లీలోని ఆసుపత్రి వైద్యులు తేల్చారు. దీర్ఘకాలంపాటు డయాలసిస్ సాధ్యపడదు కాబట్టి, మూత్రపిండ మార్పిడి చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని సూచించారు. దీంతో కోడలు ప్రాణాన్ని కాపాడేందుకు అత్తగారు  గనీదేవి ముందుకు వచ్చారు.

ముఖ్యంగా సోనికా తల్లి భాన్వరి దేవితో పాటు, సోదరుడు, తండ్రి కూడా కిడ్నీదానం చేయడానికి  నిరాకరించారు. దీంతో సోనికాను కూతురిగా భావించిన అత్తగారు గనీ దేవి తన మూత్రపిండాన్ని దానం చేయడానికి అంగీకరించారు. సెప్టెంబర్ 13న ఆపరేషన్‌ అనంతరం ప్రస్తుతం సోనికా పూర్తిగా కోలుకుంది. తనకు పునర్జన్మ ప్రసాదించిన అత్తమ్మకు  కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. అటు  తన తల్లి పూర్తి ఆరోగ్యంతో​ కోలుకోవడంతో సోనికా ఇద్దరు కుమార్తెలు కూడా సంతోషంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు