నల్లగా ఉన్నాడని...

2 Apr, 2018 15:57 IST|Sakshi

భోపాల్‌ : తెలుపు అంటే చాలామందికి విపరీతమైన పిచ్చి. ఈ పిచ్చి బాగా ముదిరితే ఎలా ఉంటుందో ఈ మహిళని చూస్తే అర్థం అవుతుంది. రాయితో రుద్దితే తెల్లగా మారతారని నమ్మి తన అయిదేళ్ల కొడుకుని తీవ్రంగా హింసించింది. చివరకు బాలల సంరక్షణ అధికారులు ఆమెను అరెస్ట్‌ చేసి, బాలుడిని కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం... నిషత్‌పూర్‌ ప్రాంతంలో నివాసం ఉండే సుధా​ తివారి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాంట్రక్ట్‌  ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో సుధా​ తివారి ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్‌లోని ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం నుంచి ఒక బాలుడిని దత్తత తీసుకుంది.

బాలుడు నల్లగా ఉండటంతో సుధా అత్తగారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో సుధా ఆ పిల్లవాడిని తెల్లగా మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా రాయితో రుద్దితే తెల్లగా అవుతారని ఎవరో చెప్పిన సలహ విని పసివాడిని రాయితో రుద్దడం ప్రారంభించింది. దీంతో ఆ చిన్నారికి ఛాతీ, భుజం, వీపు, కాళ్ల మీద గాయాలయ్యాయి. పసివాడిని అలా హింసించవద్దంటూ సుధా సోదరి కూతురు శోభన శర్మ ఆమెకు ఎన్నోసార్లు చెప్పింది. అయినా​ సుధ వినకపోవడంతో శోభన శర్మ ఆదివారం బాలల సంరక్షణ అధికారులకు ఫోన్‌ చేసింది.

సమాచారం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు, నిషత్‌పూర్‌ పోలీసులు... సుధ ఇంటి నుంచి బాలుడిని విడిపించి... హమిదియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం తదుపరి విచారణ నిమిత్తం ఆ చిన్నారిని బాలల సంరక్షణా కేంద్రానికి  తరలించారు. తన సుధా తివారి తనను ఆమె పనిచేసే పాఠశాలకు తీసుకెళ్లేదని... అయితే చదివించడానికి కాదంటూ విచారణలో తెలిపాడు.  (ఇవాళ) బాలుడిని బాలల సంరక్షణ కమిషన్‌ సభ్యుల ముందు హజరుపరచనున్నారు.

కాగా నిబంధనల ప్రకారం దత్తత తర్వాత ఆశ్రమం వారు ఆ పిల్లల బాగోగుల గురించి ఆరా తీయాలి. కానీ ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం వారు ఆ పని చేయలేదని శోభన ఆరోపించారు. దీని గురించి ‘మాతృచ్ఛాయ’ జాయింట్‌ సెక్రటరీ అమిత్‌ జైన్‌ను విచారించగా ‘మేము పిల్లలను దత్తత ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పిల్లల క్షేమ సమాచారం తెలుసుకుంటాము. మేము సుధకు ఫోన్‌ చేసి అడిగినప్పుడు ఆమె మాకు దీని గురించి చెప్పలేదు’ అన్నారు.

మధ్యప్రదేశ్‌ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ చైర్మన్‌ రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ‘ఈ విషయం గురించి నాకు ఇంకా  పూర్తి వివరాలు తెలియలేదు. కానీ దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని’ తెలిపారు.

మరిన్ని వార్తలు