ప్రశంసలందుకుంటున్న గుజరాత్‌ వ్యక్తి వినూత్న ప్రయోగం

10 Sep, 2019 08:27 IST|Sakshi

గాంధీనగర్‌: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తోంది. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరి ఇంట్లో మర్చిపోయాను సర్‌ అంటే కుదరదు. అన్ని కాగితాలను మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించుకుని తిరుగుతున్నాడు.

వివరాలు.. గుజరాత్‌ వడోదరకు చెందిన రామ్‌ షా అనే వ్యక్తి ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రోజంతా ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన నూతన మోటార్‌ వాహన చట్టం వల్ల ఏ చిన్న కాగితం మిస్‌ అయినా పెద్ద మొత్తంలో చలాన్‌ కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి రామ్‌ షా ఓ వినూత్న మార్గం కనుగొన్నాడు. ఎక్కడికెళ్లినా హెల్మెట్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. దాంతో బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించాడు. ఇక నేను కాగితాలు చూపించడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పని లేదు.. ఫైన్‌ కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు రామ్‌ షా. ఇతని ప్రయత్నాన్ని ట్రాఫిక్‌ పోలీసులు కూడా అభినందిస్తున్నారు.
(చదవండి: విక్రమ్‌ ల్యాండర్‌కు చలాన్‌ విధించం)

>
మరిన్ని వార్తలు