పెట్రో సెగ: బండిని భుజాలపై మోస్తూ నిరసన

10 Sep, 2018 12:37 IST|Sakshi
బైక్‌ను ఎత్తుకుని నిరసన

పట్నా: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌, డిజీల్‌ ధరలను నిరసిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన  భారత్‌బంద్‌ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలు నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. అయితే బిహార్‌లోని శరద్‌యాదవ్‌ కొత్తగా ఏర్పాటు చేసిన లోక్‌తంత్రిక్‌ జనతా దళ్‌ (ఎల్‌జేడీ) కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పెట్రోల్‌ ధరలతో బైక్‌ను నడపడం కన్నా దానిని మోసుకుపోవడమే బెటర్‌ అంటూ భూజాలపై ఎత్తుకుని నిరసన తెలిపారు. పెరిగిన ధరలు తమకు ఎంత భారంగా మారాయో తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేట్‌ స్కూళ్లు స్వచ్చందంగా బంద్‌పాటిస్తున్నాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు బైక్స్‌ను ఎడ్ల బండిపై ఎక్కించి నిరసన తెలిపారు.

పెరిగిన పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఈ బంద్‌కు సుమారు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 12 పైసలు, డీజిల్‌పై 10 పైసలు పెంచుతూ ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. దీంతె హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధన 85.35 పైసలుండగా.. డీజిల్‌ 78.98కు చేరుకుంది. ముంబై అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ ధర 90(89.97)కు చేరుకుంది.

మరిన్ని వార్తలు