అభివృద్ధి కోసం ఉద్యమం రావాలి

19 Mar, 2017 01:42 IST|Sakshi
అభివృద్ధి కోసం ఉద్యమం రావాలి

- నవభారతంలో అందరికీ చాన్స్‌
- ఇండియా టుడే సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగం


ముంబై: దేశాభివృద్ధి కోసం స్వతంత్ర పోరాటం లాంటి ఒక మహత్తర ఉద్యమం రావాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సామూహిక ఆకాంక్షలతో కూడిన స్వాతంత్ర ఉద్యమం లాంటి ఉద్యమం మనకు అవసరం.. అందరికీ అవకాశాలు, ఆత్మగౌరవ భారత్‌ అనే నవభారత స్వప్నంలో మనం భాగస్వాములం కావాలి’ అని అన్నారు. శనివారమిక్కడ జరిగిన ఇండియా టుడే సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఎన్నికలు, అధికారుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి పోయిందని, దేశప్రజలందరూ మార్పు కోసం ఏకతాటిపైకి వచ్చారని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం సంకుచిత దృష్టితో కాకుండా విశాల దృష్టితో వ్యవహరిస్తోందని, నవభారతంలో లబ్ధికి చోటుండదని, అందరికీ అవకాశాలు ఉంటాయని ప్రకటించారు.

మా విధానాలతో మార్పు..
తన ప్రభుత్వ విధానాలు వ్యవస్థను ధ్వంసం చేయవని, మార్పు తెస్తాయని మోదీ స్పష్టం చేశారు. ‘మేం పని సంస్కృతిలో మార్పు తీసుకొచ్చాం. గడువులోగా పనులు పూర్తి చేయడం, కలసికట్టుగా ఆలోచించి ముందుకెళ్లడంపై దృష్టి సారించాం. మా విధానాలు పౌరులకు అనుకూలమైనవి’ అని తెలిపారు. చర్చలతో కూడిన ప్రజాస్వామ్యానికి జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ప్రక్రియ నిదర్శనమని, తమకు సహకార సమాఖ్య వ్యవస్థపై విశ్వాసం ఉందని, ప్రజల శక్తి ప్రభుత్వ శక్తికంటే బలమైనదని వ్యాఖ్యానించారు.

‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఏళ్ల తరబడి విద్యుత్‌ సౌకర్యానికి నోచుకోని 12వేల గ్రామాలకు విద్యుత్‌ అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు దుకాణాలను మరింత సమయం తెరిచి ఉంచేలా చర్యలు తీసుకున్నాం. అధునాతన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం. రైల్వే, రోడ్డు రవాణా రంగాలకు గణనీయంగా వనరులు కేటాయించాం. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం. దేశంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాం’ అని వివరించారు.

>
మరిన్ని వార్తలు