కరోనా: అత్యంత ప్రమాదకర జిల్లాల రాష్ట్రాలివే!

17 Jul, 2020 13:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :10 లక్షలకు పైగా కేసులతో దేశంలో కరోనా ప్రకంపనలు రేగుతుండగా తాజా అధ్యయనం మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రమాదకర రాష్ట్రాల జాబితాను ప్రముఖ మెడికల్ జర్నల్  లాన్సెట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌, బిహార్, తెలంగాణలోని అధిక జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు కూడా ఇదే దశలో ఉన్నట్టు తెలిపింది.

ది లాన్సెట్ జర్నల్‌ లోని అధ్యయనం ప్రకారం, కోవిడ్-19 మహమ్మారికి ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, బిహార్, తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల జిల్లాలోని హౌసింగ్, పరిశుభ్రత, ఆరోగ‍్య వ్యవస్థ లాంటి అనేక ముఖ్య సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపింది. ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్‌కు చెందిన రాజీబ్ ఆచార్యతో సహా ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ మూడు రాష్ట్రాల తరువాత జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ కరోనాకు అధికంగా ప్రభావితం కానున్నాయి.

తమ అధ్యయనంలో వైరస్‌ వ్యాప్తి, కేసుల సంఖ్య, మరణాలు, సామాజిక, ఆర్ధిక ప్రభావాలతో సహా సంక్రమణ పరిణామాలను పరిశీలించినట్టు తెలిపింది. ఈ జాబితాలో అతి తక్కువ ప్రభావం గల రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ కూడా తక్కువ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయి. మహమ్మారి ప్రభావం అంచనా, వనరుల కేటాయింపులో ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, రిస్క్‌ తగ్గించే వ్యూహాలను అవలంబించడంలో తమ అధ్యయనం సహాయపడుతుందని భావిస్తున్నామని అధ్యయన వేత్తలు పేర్కొన్నారు 

మరిన్ని వార్తలు