ఫోర్జరీ కేసు: సింధియాకు ఈవోడబ్ల్యూ షాక్‌!

13 Mar, 2020 12:39 IST|Sakshi

భోపాల్‌: గ్వాలియర్‌ రాజవంశీయుడు, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన క్రమంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడిన క్రమంలో కమల్‌నాథ్‌ సర్కారు సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలో బల నిరూపణ పరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష బీజేపీ ప్రతిపాదిస్తుండగా... తమకు కొంత సమయం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌.. గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సింధియాపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి మరోసారి తాజాగా సింధియాపై కేసు నమోదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేర విభాగం(ఈవోడబ్ల్యూ) పేర్కొంది.(ఆ కుటుంబాన్ని వీడాను: సింధియా భావోద్వేగం)

ఈ మేరకు... ‘‘సురేంద్ర మరోసారి గురువారం సింధియా కుటుంబానికి వ్యతిరేకంగా మాకు ఫిర్యాదు చేశారు. 2009లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని 6 వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని తనకు అమ్మారని.. ఇందుకు సంబంధించి తప్పుడు పత్రాలు చూపించారని ఆరోపించారు. మహల్గావ్‌లోని భూమికి సంబంధించి ఈ ఫిర్యాదు చేశారు’’అని ఈవోడబ్ల్యూ తన నోట్‌లో పేర్కొంది. ఇక ఈ విషయం గురించి ఈవోడబ్ల్యూ అధికారి మాట్లాడుతూ... ‘‘ సురేంద్ర మార్చి 26, 2014లో తొలిసారి ఫిర్యాదు చేశారు. ఆ కేసును విచారించి 2018లో మూసివేశాం. అయితే తాజాగా మరోసారి పిటిషన్‌ వేశారు. కాబట్టి నిజానిజాలను తేల్చేందుకు మరలా విచారణకు సిద్ధమవుతున్నాం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి’’ అని పేర్కొన్నారు.

కాగా ఈ విషయంపై స్పందించిన సింధియా అనుచరుడు పంకజ్‌ చతుర్వేది మాట్లాడుతూ.. ఇది రాజకీయ క్షక్షపూరిత చర్య అని మండిపడ్డారు. ‘‘ఈ కేసును ఎప్పుడో మూసివేశారు. అయితే ఇప్పుడు కావాలనే తిరగదోడుతున్నారు. మాకు రాజ్యాంగం పట్ల... చట్టాల పట్ల నమ్మకం ఉంది. కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మేం సరైన సమాధానం ఇస్తాం’’అని పేర్కొన్నారు.(సింధియా నిష్క్రమణపై సచిన్‌ పైలట్‌ ట్వీట్‌)

మరిన్ని వార్తలు