మాయావతి డిమాండ్‌కు తలొగ్గిన ఎంపీ సర్కార్‌

1 Jan, 2019 18:16 IST|Sakshi

భోపాల్‌ : బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరికలతో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ దిగివచ్చింది. గతంలో దళిత సంఘాలు పిలుపుతో జరిగిన భారత్‌ బంద్‌ సందర్భంగా నమోదైన రాజకీయ కేసులను ఉపసంహరించకుంటే మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు మద్దతుపై పునరాలోచిస్తామని మాయావతి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దళితుల ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరిస్తున్నట్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

యూపీ, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌ సహా అప్పటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ నేపథ్యంలో అమాయక దళితులపై కేసులు నమోదు చేశారని, వీటిని మధ్యప్రదేవ్‌, రాజస్ధాన్‌లో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించాలని మాయావతి సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. మాయావతి డిమాండ్‌ను మధ్యప్రదేశ్‌ సర్కార్‌ అంగీకరించింది. భారత్‌ బంద్‌ నేపథ్యంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం మోపిన రాజకీయ కేసులన్నింటినీ ఉపసంహరించాలని నిర్ణయించామని న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు