నిరసనల్లో ఎంపీ కారు ధ్వంసం

5 Aug, 2018 18:47 IST|Sakshi
బీజేపీ ఎంపీ హీనా గవిట్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : మరాఠా నిరసనల్లో భాగంగా మహారాష్ట్రలోని ధూలేలో ఆదివారం బీజేపీ ఎంపీ హీనా గవిట్‌ కారు ధ్వంసమైంది. ధూలే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి హీనా కారు వెలుపలికి వచ్చిన మరుక్షణమే నిరసనకారులు కారుపై దాడికి తెగబడి అద్దాలు పగులగొట్టారని పోలీసులు చెప్పారు. దాడి జరిగిన సమయంలో ఎంపీ హీనా గవిట్‌ వాహనంలోనే ఉన్నారని, ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారని ధూలే ఎస్పీ ఎం రామ్‌కుమార్‌ వెల్లడించారు.

నందుర్బార్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి హీనా  లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 16 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఓబీసీ కోటా కింద మరాఠాలు 16 శాతం రిజర్వేషన్‌ను డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరాఠాల ఆందోళనతో ముంబయి సహా రాష్ట్రమంతటా బంద్‌లు, రాస్తారోకోలతో అట్టుడుకుతోంది. మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌కు మరాఠాల సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరాఠాలకు కోటా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిఉందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇప్పటికే ప్రకటించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు