‘కాంగ్రెస్‌ త్రీ ఇడియట్స్‌’ వివాదం

10 May, 2018 11:17 IST|Sakshi
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఈ మధ్య మార్ఫింగ్‌ వీడియోలు బాగా ప్రచారం అవుతున్నాయి. ఇవి సినీ ప్రముఖులు, మరేవరివో సంబంధించినవి కావు. రాజకీయ నాయకులకు సంబంధించినవి. రెండు రోజుల క్రితమే  ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ను రామాయణంలోని అంగదునిగా చూపిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులను రావణాసురునితో పోలుస్తూ మార్ఫింగ్‌ చేసిన వీడియోను ఒక దాన్ని పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే ఇదే తరహా మార్ఫింగ్‌ వీడియో మరొకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌ నాధ్‌, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలను హిందీ సినిమా ‘త్రీ ఇడియట్స్‌’ పాత్రలుగా మార్ఫింగ్‌ చేశారు. వీరు ముగ్గురు ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలోని ‘ఆల్‌ ఇజ్‌ వెల్‌’ పాటకు కాలు కదుపుతున్నట్లు ఉన్న వీడియోను పోస్టు చేశారు. ఈ పేరడి వీడియోపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ ఎప్పట్లానే ఈ వివాదానికి దూరంగా ఉంది. ఈ వీడియో గురించి బీజేపీ నేత రాజినీష్‌ అగర్వాల్‌ ‘ఈ పేరడీ వీడియోలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ చర్యకు పాల్పడినవారి మీద కాంగ్రెస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరం లేద’ని తెలిపారు.

దీని గురించి కాంగ్రెస్‌ నేత మానక్‌ అగర్వాల్‌ ‘మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వానికి బీటలు వారుతున్నాయి అందుకే వారు ఇలాంటి వికారమైన పనులు చేస్తున్నార’ని అన్నారు. ఇదిలావుండగా నిన్ననే బీజేపీ ఐటీ సెల్‌ ముఖ్య అధికారి అయిన శివరాజ్‌ సింగ్‌ దబి తన ట్విటర్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ను అంగదునిగా చూపిస్తూ రూపొందించిన రామాయణం మార్ఫింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. ఈ పేరడీ వీడియోల గురించి కాంగ్రెస్‌ నాయకులు మధ్యప్రదేశ్‌ సైబర్‌ సెల్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు