వాటిని రాజకీయాలతో పోల్చొద్దు: నుస్రత్‌ జహాన్‌

4 Jul, 2019 17:20 IST|Sakshi
ఇస్కాన్‌ రథయాత్రలో నుస్రత్‌ జహాన్‌

కోల్‌కతా: పార్లమెంట్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీగా నుస్రత్‌ జహాన్‌ సింధూరం, మంగళసూత్రంతోనే ప్రమాణం చేయడం ముస్లిం మత వర్గానికి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఇస్కాన్‌ సంస్థ నిర్వహించిన వార్షిక రథయాత్రకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి నుస్రత్‌ జహాన్‌ అదే వస్త్రధారణతో హాజరవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయమై నుస్రత్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను పుట్టుకతోనే ముస్లింనని, నాకు నా మతమేంటో తెలుసని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను నేను పట్టించుకోనని' ఘాటుగానే స్పందించారు. తాను ఒక ఎంపీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, మతాన్ని రాజకీయంతో పోల్చడం తగదని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు నుస్రత్‌ జహాన్‌ చేసిన వాఖ్యలపై ఇస్కాన్ ప్రతినిధి రాధా రామ్‌దాస్ ట్విటర్‌లో స్పందించారు. 'రథయాత్ర వేడుకకు వచ్చినందుకు ముందుగా అభినందనలు. మీరు చేసిన వాఖ్యలు మాకు ఆనందాన్ని కలిగించాయి. మీ మతాన్ని గౌరవిస్తూనే ఇతర వేడుకలకు హాజరవడం మత సామరస్యాన్ని పెంపొందించింది. దీన్ని మీరు ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం' అని ట్వీట్‌ చేశారు.

ఇంతకుముందు సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18 చానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో నుస్రత్‌ జహాన్‌ తన పెళ్లి విషయమై మాట్లాడుతూ... ‘నేను ఒక హిందువును పెళ్లాడిన సంగతి మీకు తెలిసిందే. నా నుదుటి మీద బొట్టును చూసి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయానికి అణుగుణంగానే నడుచుకుంటున్నా. ప్రతి వ్యక్తికి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. నేను ముస్లిం మతాన్ని, మావారు హిందూ మతాలను గౌరవిస్తాం. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయ’ని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు