ఒకే గదిలో స్త్రీ, పురుష అభ్యర్థులకు వైద్య పరీక్షలు

2 May, 2018 17:26 IST|Sakshi
భింద్‌ జిల్లా ఆస్పత్రిలో మెడికల్‌ పరీక్షలు..

భింద్‌, మధ్యప్రదేశ్‌: ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు శాఖ మధ్యప్రదేశ్‌ పోలీసు నియామక ప్రక్రియలో వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అభాసు పాలైంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌ పరీక్ష నిర్వహించడం తప్పనిసరి. అయితే భింద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం స్త్రీ, పురుషు అభ్యర్థులకు ఒకే గదిలో వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసు శాఖ వార్తల్లో కెక్కింది.

పరీక్ష నిమిత్తం కొందరు యువకులు తమ దుస్తులు విప్పదీస్తున్న వీడియో బయట పడడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇంకో విస్మయ పరిచే విషయమేంటంటే.. మహిళా అభ్యర్థుల మెడికల్‌ పరీక్ష కూడా అదే గదిలో అదే సమయంలో నిర్వహిస్తుండడం. వారి సహాయార్థం అక్కడ ఒక్క మహిళా డాక్టరు గానీ, నర్సు గానీ అందుబాటులో లేకపోవడంతో పోలీసు శాఖ నిర్వాకం బట్టబయలైంది.

‘ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. సదరు ఎగ్జామినేషన్‌ కమిటీ సభ్యులకు నోటీసులు జారీ చేశాం. బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని భింద్‌ జిల్లా ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 217 మందిలో మంగళవారం 18 మంది యువతులు, 21 మంది యువకులకు వైద‍్య  పరీక్ష నిర్వహించే సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు