మమ్మల్ని మాలాగా బతకనివ్వండి చాలు: వంగా గీత ఉద్వేగం

2 Dec, 2019 14:08 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో సోమవారం చర్చ జరిగింది. ఘటనను తీవ్రంగా ఖండించిన ఇరు సభలు.. త్వరగతిన కేసును విచారించి దోషులకు సత్వరమే శిక్ష విధించాలని విఙ్ఞప్తి చేశాయి. పాశవిక ఘటనపై చర్చ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మహిళా ఎంపీలు తమ గళం వినిపించారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ... ఇలాంటి ఘటలనకు పాల్పడాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇటువంటి దారుణాలు అరికట్టలేకపోతే ఆడపిల్లలను మళ్లీ ఇంటికే పరిమితం చేయాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఇది హృదయ విదారక ఘటన. నిర్భయ ఘటన తర్వాత అందరి హృదయాలను అంతగా కలచివేసింది. ఓ డాక్టర్‌ మీద అత్యంత క్రూరంగా నలుగురు.. 20 ఏళ్లలోపు వాళ్లు అత్యాచారం చేసి చంపేశారు. రాజకీయాలు చేయడం చేయకుండా అందరూ ఈ విషయాన్ని ఖండించాలి. ఆర్టికల్‌ 370 రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా భరతమాత తలెత్తుకునేలా చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రాలతో కలిసి అత్యాచార ఘటనలను అరికట్టేలా చట్టాలు రూపొందించాలి అని లోక్‌సభ వేదికగా ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా... మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మహిళలను పూజించే దేశం మనది. కానీ నేడు ఓ కూతురుని బడికి పంపించాలంటే భయం వేస్తోంది. బిడ్డను బయటికి వెళ్తే తిరిగివస్తుందో లేదోననే ఆందోళన నెలకొంటోంది. మహిళలను పూజించక్కర్లేదు. గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు గానీ ఇటువంటి ఘటనలకు మాత్రం పాల్పడకండి. స్వేచ్ఛగా బతకనివ్వండి’  అని వంగా గీత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

ఇక టీఆర్‌ఎస్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. నిర్భయ ఘటన జరిగి ఇన్నేళ్లు అవుతున్నా... దోషులకు ఉరిశిక్ష అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌తి ఏడాది 33వేల అత్యాచార కేసులు న‌మోదు అవుతున్నాయన్నారు. విమర్శలు చేసుకోకుండా పార్టీల‌కు అతీతంగా చ‌ట్టం తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. దిశ హ‌త్య ఘ‌ట‌న దేశాన్ని కుదిపివేసిందన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా