ప్యాకేజీ.. హోదాకు సమానమని పక్కదోవ

8 Dec, 2016 04:55 IST|Sakshi
ప్యాకేజీ.. హోదాకు సమానమని పక్కదోవ

- జీరో అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
- తక్షణం హోదా ప్రకటించాలని డిమాండ్


 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు.. ఇప్పటికే ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ సమానమని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ’రాష్ట్రం విడిపోయిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు వర్తించేలా ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగిన రోజున ఆనాటి ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. బిల్లు పాసైంది. కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ ఆమోదం తెలిపింది.

కానీ మూడేళ్లయినా పురోగతి లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ఈ వార్త విని ఏపీ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని అడుగుతున్నా, ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పడం లేదు. అయితే ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని బట్టి చూస్తే కేంద్రానికి ఇక ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని అనిపిస్తోంది. ఎలాంటి ఆలస్యం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు.

 ఇరు పక్షాలు ప్రత్యేక హోదా ఇవ్వజూపారుు: బుట్టా రేణుక
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి పాలకపక్షం, ఇవ్వాల్సిందేనని నాటి ప్రతిపక్షం చేసిన ప్రకటనలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక కేంద్రానికి మరోసారి గుర్తు చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందనీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆమె కోరారు.

>
మరిన్ని వార్తలు