ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు: వైవీ

23 Mar, 2017 02:44 IST|Sakshi
ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు: వైవీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావనల కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు మూడేళ్లుగా విజ్ఞప్తిచేస్తూ వస్తున్నారు.  నీతి ఆయోగ్‌ దీనిపై అధ్యయనం చేస్తుందని గతంలో కేంద్రం చెప్పింది.గతేడాది ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. దీనిని గతవారం కేంద్ర మంత్రిమండలి కూడా ఆమోదించింది.

కానీ అందులో ఉన్న అంశాలన్నీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన ప్రయోజనాలే తప్ప ప్రత్యేకంగా పెద్దగా ప్రయోజనం ఉన్న అంశాలేవీ లేవు. అందువల్ల ప్రజలు ప్రత్యేక సాయాన్ని తిరస్కరించారు. ప్రత్యేక హోదా కోసమే డిమాండ్‌ చేస్తున్నారు. అందువల్ల నీతిఆయోగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టండి. ఆ సిఫారసులతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయండి..’’ అని విన్నవించారు.

మరిన్ని వార్తలు