ఎంపీలు సూపర్ పౌరులు కాదుః అశోక్ గజపతి రాజు

5 May, 2016 16:02 IST|Sakshi

న్యూఢిల్లీః పాలనలో పారదర్శకత చూపించే నాయకుల్లో అశోక్ గజపతిరాజు ముందుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఆ విషయం రూఢి చేశారు. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కూడ అదే రీతిలో స్పందించారు.  ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డంలో ఏమాత్రం జంకని ఆయన... ఎయిర్ పోర్టుల్లో తమకు కొంత ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి మెంబర్ల డిమాండ్ కు.. దీటుగా సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ మెంబర్లంటే సూపర్ పౌరులు కాదని, వారు కూడ సాధారణ ప్రజలేనని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు... తేల్చి చెప్పారు.
విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంపీలు సూపర్ పౌరులు కాదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు లోక్ సభలో వెల్లడించారు.  ప్రశ్నోత్తరాల సమయంలో తనకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ... పార్లమెంట్ మెంబర్లు వారి వారి మంత్రి పదవులతో కొంత ప్రత్యేక గౌరవాన్ని పొందుతారని, అదే నేపథ్యంలో వారి విమాన ప్రయాణంలోనూ ఎటువంటి ఇబ్బందులు  తలెత్తకుండా ఆ శాఖ అన్ని సౌకర్యాలను అందిస్తుందని తెలిపారు.  అయితే ఎంపీలు సూపర్ పౌరులు కాదని, విమానాశ్రయాలవద్ద తమకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి సభ్యుల డిమాండ్ ను తిరస్కరించారు.
అయితే తమ ఐడీ కార్డులను చూపించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో సిబ్బంది  గుర్తు కూడ పట్టడం లేదని కొందరు సభ్యులు వాపోవడంతో... చాలా విమానాశ్రయాల్లో ఎంపీలు కమిటీ సభ్యులు అయి ఉంటారని, కాబట్టి విమానాశ్రయాల్లో వారిని గుర్తించరన్న విషయం వాస్తవం కాదని కేంద్ర మంత్రి  తెలిపారు. ఎంపీలు ఐడీ కార్డులు చూపినప్పుడు అవకాశాన్ని బట్టి వారి సీట్లు హయ్యర్ క్లాస్ కు అప్ గ్రేడ్ చేయాలన్న టీఆర్ ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన అశోక్ గజపతి రాజు.. టిక్కెట్ల వాణిజ్య తరగతులను బట్టి అప్ గ్రేడేషన్ జరుగుతుందని, అందులో ముందుగా అధికారులకు అవకాశం ఇస్తారు తప్పించి, ఎంపీలకు కాదన్నారు. అంతేకాక వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు, ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రజలకు సీట్లు మంజూరు చేసే విషయంలోకూడ కొంత మానవతా కోణంలో చూడాల్సి వస్తుందని, అందులో కూడ వాణిజ్య కోణం ఉంటుందని అన్నారు. ఎయిర్ ఇండియా తోపాటు ఇతర ఎయిర్ లైన్స్ కూడ వాణిజ్య పరిగణల ఆధారంగానే అప్ గ్రేడ్ చేసేందుకు వీలౌతుందని అశోక్ గజపతి రాజు తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు