చుక్‌ ‘మక్‌’ రైలే!

18 Sep, 2018 21:15 IST|Sakshi

రైలు పట్టాలపై చెత్తను తొలగిస్తున్న రైళ్లు

మక్‌ ట్రైన్లు... అంటే ఏమిటీ అన్న ‘కౌన్‌బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమంలోని ప్రశ్నకు మెగ్‌సెసే అవార్డు గ్రహీతలు ప్రకాశ్‌బాబా అమ్టే, ఆయన భార్య మందాకిని ఆమ్టే టక్కున సమాధానం చెప్పేశారు. దీంతో ఈ పేరు ఒక్కసారిగా స్పాట్‌లైట్‌లోకి వచ్చేసింది. సాధారణంగా రోడ్ల వెంట లేదా కాలువల పక్కన పడి ఉన్న చెత్తా,చెదారాన్ని ఎత్తేందుకు మున్సిపల్‌ లారీలు ఉపయోగించడం చూస్తుంటాం. అదే రైలు పట్టాల వెంట, చుట్టుపక్కలా పడిన మురికి, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ‘మక్‌ రైళ్లు’ ఉపయోగిస్తున్నారు. సెంట్రల్, వెస్ట్రన్‌ రైల్వేస్‌ ఆధ్వర్యంలో ఈ సర్వీసు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముంబై మహానగరంలోని సబ్‌ అర్భన్‌ రైళ్ల పట్టాల వెంట, చుట్టుపక్కల చెత్తాచెదారం అమితంగా పోగుపడుతుండడంతో దానిని తొలగించేందుకు రోజువారి పద్ధతిలో ‘మక్‌ ప్రత్యేక రైళ్లు’ నడుపుతున్నారు.

రోజంతా రాకపోకలు సాగించిన  ప్యాసెంజర్‌ రైళ్లు విశ్రాంతి తీసుకున్నాక  ఈ స్పెషల్‌ ట్రైన్లు ప్రతీరోజు తెల్లవారు జామున 2–4 గంటల మధ్య తమకు అప్పగించిన పనిని పూర్తిచేస్తాయి. 2017  ఏప్రిల్‌ – 2018 మార్చి మధ్యలో సెంట్రల్‌ రైల్వేస్‌ 94 వేల క్యూబిక్‌ మీటర్ల చెత్తను, వెస్ట్రన్‌ రైల్వేస్‌ 75 వేల క్యూబిక్‌ మీటర్ల చెత్తను తొలగించాయి. ఈ రైళ్ల నుంచి చెత్తను ఎత్తేసేందుకు రైల్వేఅధికారులు జేసీబీలు ఉపయోగిస్తున్నారు. రైలు పట్టాల పక్కన పడేస్తున్న చెత్త పరిమాణం క్రమక్రమంగా పెరుగుతుండగా, దానికి తగ్గట్టుగా చెత్త తొలగింపు చర్యలను రైల్వేశాఖ చేపడుతోంది. రైల్వేనెట్‌వర్క్‌ను పరిశుభ్రంగా ఉంచడంలో రైల్వేశాఖ ఉద్యోగులు చేస్తున్న కృషిని గురించి ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రైళ్లు, పట్టాలు, పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రయాణీకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛభారత్‌ అభియాన్‌’లో మక్‌ రైళ్లు నిర్వహిస్తున్న పాత్రను గురించి రైల్వేశాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ ఇటీవల తన ట్వీట్లలో కొనియాడారు.


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా