అమెరికాలో వేలానికి షాజహాన్‌ కత్తి

28 May, 2019 04:29 IST|Sakshi

న్యూఢిల్లీ: మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్‌జిత్‌ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్‌ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్‌జిత్‌ సింగ్‌ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు.

జైపూర్‌రాజు సవాయ్‌ మాన్‌సింగ్‌–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్‌ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్‌ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది.   

మరిన్ని వార్తలు