ఇక దీన్‌ దయాల్‌ చికెన్‌....!

6 Jun, 2018 17:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముఘల్‌సరాయ్‌ రైల్వే స్టేషన్‌ను మంగళవారం నాడు అధికారికంగా పండిట్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ రైల్వే స్టేషన్‌గా మార్చారు. ఈ పేరు మార్చే ప్రక్రియను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే చేపట్టింది. ఈ స్టేషన్‌కు ఆయన పేరు పెట్టడానికి కారణం ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పట్టాలపైనే 1968, ఫిబ్రవరి 11వ తేదీన దీన్‌దయాల్‌ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. ఆయన ఆరెస్సెస్‌ సభ్యుడే కాకుండా భారతీయ జన్‌ సంఘ్‌ సహ వ్యవస్థాపకులు. 

ఇలా పేర్లు మార్చడం పట్ల పలువురు ట్వీట్లు పేలుస్తున్నారు. చికిన్‌ ముఘ్లాయిని ఇక చికెన్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ అని, బెంగాల్‌ ముఘ్లాయి పరోటాను, దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ పరోటా అని పిలవాలని సూచిస్తున్నారు. దీన్‌ దయాల్‌ బిర్యానీ, దీన్‌ దయాల్‌ టిక్నా, దీన్‌ దయాల్‌ కుర్మా, దీన్‌ దయాల్‌ చికెన్‌ టిక్కా... అంటూ పేర్లు పెడుతున్నారు. మెఘల్‌ ఏ ఆజమ్‌ సినిమా పేరును కూడా మార్చాలని కోరుతున్నారు. 

ఇంతకు ఈ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ ఎవరని, ఆయన దేశానికి చేసిన సేవలేమిటో చెప్పండంటూ కొందరు నిలదీస్తున్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రీ ముఘల్‌సరాయ్‌లో పుట్టారని, ఆయన స్వాతంత్య్ర యోధుడని, ఆయన దేశానికి రెండో ప్రధాన మంత్రి అని, రైలు ప్రమాదం జరిగినందుకు ఆయన తన రైల్వే శాఖకు రాజీనామా చేశారని, పెడితే అలాంటి గొప్పవ్యక్తి పేరు పెట్టాలని, ఆయన దీన్‌ దయాల్‌ లాగా రైలు పట్టాలపై చనిపోకపోవడమే ఆయన తప్పా? ట్విటర్‌లో పలువురు ప్రశ్నిస్తున్నారు. 

అసలు పేరు మార్చడం వల్ల ఒరిగేది ఏముందని, మౌలిక సౌకర్యాలను మెరగుపర్చాలని కొందరు సూచిస్తున్నారు. రైళ్లు సక్రమంగా వచ్చేలా, సవ్యంగా నడిచేలా చూడాలని, స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. యోగి ఆధిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో ఆయన పలు పేర్లను మారుస్తున్నారు. ఆయన గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్నప్పటి నుంచే గోరఖ్‌పూర్‌లోని ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, అలీ నగర్‌ను ఆర్య నగర్‌గా, మియా బజార్‌ను మాయా బజార్‌గా, ఇస్లామ్‌పూర్‌ను ఈశ్వర్పూర్‌గా, హుమాయున్‌ నగర్‌ను హనుమాన్‌ నగర్‌గా మార్చారు. 

తాజ్‌ మహల్‌ను తాను రామ్‌ మహల్‌ అని పేరు మార్చడానికి కూడా తాను వెనకాడనని యోగి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియాను హిందుస్థాన్‌గా మారుస్తూ కూడా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం ఔరంగాజేబ్‌ రోడ్డును అబ్దుల్‌ కలామ్‌ రోడ్డని, అక్బర్‌ ఫోర్ట్‌ను అజ్మీర్‌ ఫోర్ట్‌ని కూడా మార్చింది. పేర్లు మార్చినప్పటికీ ప్రజలు మాత్రం పాతపేర్లనే ఇప్పటికీ ఉచ్ఛరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు