తీర్పు ఎలా ఉన్నా సంబరాలొద్దు

6 Nov, 2019 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీమసీదు కేసులో తీర్పు ఎవరి వైపు వచ్చినా, భారీ ఉత్సవాలకు దూరంగా ఉండాలని హిందూ–ముస్లిం ప్రతినిధులు నిర్ణయించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్‌ అబ్బాస్‌ నఖ్వి నివాసం వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హిందువుల తరఫున ఆరెస్సెస్, బీజేపీ ప్రతినిధులు కృష్ణ గోపాల్, రామ్‌లాల్‌లు హాజరయ్యారు. ముస్లింల తరఫున కేంద్రం మంత్రి అబ్బాస్‌ నఖ్వి, మాజీ కేంద్ర మంత్రి  షానవాజ్‌ హుస్సేన్, జమాయత్‌ ఉలేమా ఏ హిందూ ప్రధాన కార్యదర్శి మహ్మూద్‌ మదాని, షియా బోధకుడు కాల్బే జవాద్‌లు హాజరయ్యారు.

ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతూ... తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా, ఉత్సవాలు జరపకూడదని పిలుపునిచ్చారు. గెలిచినట్లుగానీ, ఓడినట్లుగానీ భావించ కూడదని తెలిపారు. భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతోందని, అదే అందరినీ కలిపి ఉంచుతోందని అభిప్రాయపడ్డారు. 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, త్వరలో తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాపై పోలీసుల కన్ను  
అయోధ్య కేసులో తీర్పు వెలువడనుందన్న ఊహాగానాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై కన్నేసింది. ఫైజాబాద్‌ జిల్లాలో 16 వేల మంది వాలంటీర్లను పోలీసులు నియమించారు. దాదాపు అదే సంఖ్యలో మరో వాలంటీర్ల బృందాన్ని జిల్లాలోని 1,600 ప్రాంతాల్లో నియమించారు. వీరంతా తీర్పు తర్వాత సోషల్‌మీడియాపై నిఘా వేయనున్నారు.

>
మరిన్ని వార్తలు