‘బీజేపీ గూటికి ముకుల్‌ రాయ్‌’

11 Oct, 2017 17:57 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు బహిష్కరణ వేటుకు గురైన తృణమూల్‌ ఎంపీ ముకుల్‌ రాయ్‌ బీజేపీ గూటికి చేరనున్నారు.రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు పంపానని తెలిపారు. ఇక బీజేపీ సీనియర్‌ నేతలు తనతో ఎంతో సన్నిహితంగా మెలుగుతారని, వారిని సంప్రదిచడం తనకు సౌకర్యవంతంగా ఉంటుందని రాయ్‌ పేర్కొన్నారు. గత నెల 25న తనపై పార్టీ వేటు వేసిన మరుక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి ముకుల్‌ రాయ్‌ రాజీనామా చేశారు. 20 ఏళ్లుగా మమతకు నమ్మకమైన కుడిభుజంగా ఉన్న ముకుల్‌ రాయ్‌.. 'భారమైన హృదయంతో, బాధతో తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడుతున్నాన'ని మీడియాతో చెప్పారు.

తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 2004లో తనను సంఘ్‌ నేతలతో సమావేశం కావాలని సూచించారని చెప్పారు. ఇక 2003లో దీదీ ఏకంగా తానే వీహెచ్‌పీ నేత అశోక్‌ సింఘాల్‌తో భేటీ అయ్యారని,బీజేపీ నేతలతో సమావేశం కావడం నాకు కొత్తేం కాదని తెలిపారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు తనకు సౌకర్యవంతంగా ఉంటాయన్న రాయ్‌ ఆ పార్టీలో చేరుతారా అన్నదానిపై మాత్రం సమాధానం దాటవేశారు. ముకుల్‌ రాయ్‌ గత కొద్ది రోజులుగా పలువురు సీనియర్‌ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాయ్‌కు బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి పదవిని ఆఫర్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

>
మరిన్ని వార్తలు