ములాయం కొత్త పార్టీ!!

5 May, 2017 19:47 IST|Sakshi
ములాయం కొత్త పార్టీ!!

కన్న కొడుకుతో విభేదాలు.. తమ్ముడికి అందలం.. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగింపు.. ఇంతటి ఘోర అవమానాలను చూసిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్.. పాతికేళ్ల తర్వాత మళ్లీ కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నయ్య ములాయం సింగ్ నేతృత్వంలో 'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే ఈ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తమ్ముడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. నేతాజీకి ఆయన గౌరవం తిరిగి ఇప్పించడానికి, సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని శివపాల్ యాదవ్ చెప్పారు. సుమారు పాతికేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలతో ఒక విధంగా రోడ్డున పడ్డారు. తాను స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది.

ఎట్టకేలకు తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా.. ప్రచారపర్వంలో మళ్లీ ఆ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం తన తమ్ముడు పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు చిన్నకోడలు పోటీ చేసిన లక్నో కంటోన్మెంటు స్థానంలో మాత్రమే ములాయం ప్రచారం చేశారు. అందులో చిన్నకోడలు అపర్ణాయాదవ్ ఓడిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారం లేక, అటు పార్టీ మీద కూడా పట్టులేకుండా ఎందుకని అనుకున్నారో ఏమో.. చివరకు సొంత పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీని పెట్టినప్పుడు తనకు తోడుగా ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నవారిలో ఎంతమంది ములాయం వెంట వస్తారో చూడాల్సి ఉంది. ఈ వయసులో మళ్లీ ఆయన రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీకి ప్రచారం చేసి, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కూడా ఎంవతరకు సాధ్యమో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు