అట్టహాసంగా ములాయం జన్మదినం

22 Nov, 2014 01:14 IST|Sakshi
అట్టహాసంగా ములాయం జన్మదినం
  • లండన్ నుంచి దిగుమతైన గుర్రపు బగ్గీలో విహారం
  • డబ్బులెక్కడివంటే తాలిబన్లు, దావూద్ ఇచ్చారని ఆజంఖాన్ వెటకారం
  • రాంపూర్: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ 75వ జన్మదిన వేడుకలు వివాదాస్పదమయ్యాయి. ములాయం తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విదేశాలనుంచి దిగుమతిచేసుకున్న విలాసవంతమైన గుర్రపుబగ్గీలో విహరించడం విమర్శలకు దారితీసింది. ఈ వేడుకలపై ఆ పార్టీ నేత, రాష్ట్రమంత్రి ఆజంఖాన్ వ్యాఖ్యానించడం మరీ వివాదాస్పదమైంది.

    శుక్రవారం ఆజంఖాన్ నియోజకవర్గమైన రాంపూర్‌లోని జౌహర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఉత్సవవేదికవద్దకు ఆ గుర్రపు బగ్గీలో ములాయం, ఆయన తనయుడు, రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు ఊరేగింపుగా చేరుకున్నారు. ఈ ర్యాలీలో వేలాదిమంది ఆజంఖాన్ అనుచరులు పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీకీ ఆజంఖానే చాన్సలర్ కావడం గమనార్హం. ఈ వేడుకలకోసం 75 అడుగుల భారీ కేక్‌ను తయారు చేశారు. వివాదానికి కారణమైన గుర్రపు బగ్గీని లండన్‌నుంచి దిగుమతి చేసుకున్నారని చెపుతున్నారు.

    ఈ ఆడంబరాలకు నిధులు ఎక్కడివని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆజంఖాన్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ‘డబ్బులు ఎక్కడినుంచి వస్తే ఏమిటి? కొంచెం తాలిబన్లు, కొంచం అబూసలేం, మరికొంచం దావూద్ ఇబ్రహీం ఇచ్చార’న్నారు. విమానాశ్రయం నుంచి ఉత్సవ వేదికవరకు సుమారు 200 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. నవాబుల కాలంనాటి పద్ధతుల్లో పరిసరాలను తీర్చిదిద్దారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ములాయం, ఆయన కుమారుడికి భారీ ఎత్తున స్వాగతం పలికారు.  ఇది వృథావ్యయమని బీజేపీ నాయకుడు విజయ్ పాఠక్ వ్యాఖ్యానించారు.
     

మరిన్ని వార్తలు