మల్బరీ రైతు ఖుషీ

14 Mar, 2020 09:16 IST|Sakshi
ఉక్కుంద గ్రామంలో పట్టు గూళ్లు విప్పుతున్న రైతులు

చైనానుంచి నిలిచిపోయిన పట్టు దిగుమతులు

దేశీయ పట్టు గూళ్లకు మంచి ధరలు

ఆనందంలో మల్బరీ రైతులు

కర్ణాటక, కోలారు: కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఎన్నో  పరిశ్రమలు మూత పడుతున్నాయి. చైనా దిగుమతులు తగ్గి దేశంలోనూ తయారీ రంగం కుదేలైంది. అయితే చైనా నుంచి పట్టు దిగుమతి నిలిచిపోవడం  దేశీయ  పట్టు గూళ్ల ధరలకు రెక్కలొచ్చి మల్బరీ రైతులపై లాభాల వర్షం కురుస్తోంది. పట్టు ఉత్పాదన పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేకమంది రైతులకు ధరల పెరుగుదల మరింత ఉత్సాహం కలిగిస్తోంది. మార్కెట్‌లో సాధరణ పట్టుగూళ్లు కిలో రూ. 420 నుంచి రూ. 600 వరకు ధరలు ఉంటే బైవోల్టిన్‌ పట్టు కిలో రూ.500 ధర పలుకుతోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మల్బరీ సాగు పెద్ద ఎత్తున సాగులో ఉంది.  వ్యవసాయంలో నష్టాలు రావడంతో చాలా మంది రైతులు చిన్నపాటి షెడ్లు ఏర్పాటు చేసుకొని పట్టు సాగు చేస్తున్నారు. ఏడాదికి ఎనిమిది పంటలు తీస్తున్నారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో మల్బరీ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంకన్నా రెట్టింపు లాభాలను రైతులు  పొందుతున్నారు.

కూరగాయాలు, ఇతర వ్యాపారాలు డల్‌ :  జిల్లాలో పట్టుగూళ్ల ధరలు పెరుగుతుండగా కూరగాయల ధరలు గణనీయంగా పడిపోయాయి. కోలారు జిల్లాలో అత్యధికశాతం మంది రైతులు కూరగయాలు పండిస్తున్నారు. కూరగాయల్లో టమాట సాగుకు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది.  కరోనా ఎఫెక్ట్‌తోపాటు సాగు విస్తీర్ణం పెరగడంతో  టోకు మార్కెట్‌లో కిలో టమాట 5 మాత్రమే ధర పలుకుతోంది.

తగ్గిన ఐస్‌క్రీం విక్రయాలు : కరోనా ప్రభావం ఐస్‌క్రీం వ్యాపారంపైకూడా పడింది. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీంల వల్ల కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందని వదంతులు రావడంతో వేసవిలో ఐస్‌క్రీం, చల్లటి పానీయాలకు డిమాండ్‌ ఎక్కువ తమ వ్యాపారం వేసవిలోనే అధికంగా ఉండి సీజన్‌లో వ్యాపారం తగ్గితే చాలా నష్టపోవాల్సి వస్తుందని ఐస్‌క్రీం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టు ధరలు మరింతపెరిగే అవకాశం
 పట్టుగూళ్లకు  ఉత్తమ ధరలు వచ్చాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.కరోనా ప్రభావం వల్ల చైనా నుంచి పట్టు దిగుమతి లేక ధరలు పెరిగాయి.  నాణ్యమైన గూళ్లనుఉత్పత్తి చేసే రైతులకు సిరులు కురవడం ఖాయం.–శ్రీనివాస్‌ డిప్యూటీ డైరెక్టర్‌పట్టుపరిశ్రమశాఖ  

రాబడి పెరిగింది
కరోనా  వల్ల చైనా నుంచి పట్టు  దిగుమతులు  నిలిచిపోవడం వరంగా మారింది. పట్టుగూళ్ల ధరలు గణనీయంగా పెరిగి రాబడి పెరిగింది. కష్టపడి పండించిన పంటకు మంచి లాభాలు వస్తున్నాయి.
–రామప్ప, రైతు,మూతనూరు గ్రామం  

మరిన్ని వార్తలు