ఉగ్ర దాడికి జైషే భారీ కుట్ర..

10 Nov, 2019 13:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మిలటరీ ఇంటెలిజెన్స్‌, రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి నిఘా సంస్థలు పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని హెచ్చరించడం పొంచి ఉన్న ఉగ్రముప్పు తీవ్రతను స్పష్టం చేస్తోందని ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పు ఏ క్షణంలోనైనా వెలువడవచ్చనే దృష్టిలో  ఉగ్ర సంస్ధల భారీ విధ్వంస రచనపై నిఘా సంస్ధలు గత పదిరోజులుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగ్ర హెచ్చరికలు డార్క్‌ వెబ్‌లో పోటెత్తడంతో​ వీటి గుట్టుమట్లను తేల్చడం భద్రతా దళాలకు సంక్లిష్టంగా మారిందని అన్నారు. నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలను బేరీజు వేసిన భద్రతా దళాలు ఉగ్ర మూకల ప్రతిపాదిత టార్గెట్లను పసిగట్టి ముప్పును నిరోధించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. ఉగ్ర మూకలు ఢిల్లీ, యూపీ, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు, నగరాలపై ఉగ్రదాడులతో విరుచుకుపడతారిని భావిస్తున్నారు. కాగా ఆర్టికల్‌ 370 రద్దు చేపట్టినప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్ర ముప్పును నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు.

మరిన్ని వార్తలు